Friday, November 22, 2024

ఆధునిక టెక్నాలజీల దుర్వినియోగం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్త్రీ, పురుష అసమానతలను మరింత ఉధృతం చేసే గర్భస్థ శిశువుల నిర్ధారణ కోసం ఉపయోగించే ఆధునిక సాంకేతికతల దుర్వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ అంశంతో సంబంధం ఉన్న అన్ని వర్గాలను హెచ్చరించారు.ఈ నెల 18న జరిగిన కేంద్రసూపర్వైజరీ బోర్డు (సిఎస్‌బి) 29వ సమావేశంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బాలికలు, మహిళల పట్ల లైంగిక వివక్షను అంతమొందించేందుకు దేశం జరుపుతున్న పోరాటం పట్ల కృత నిశ్చయాన్ని ఈ సమావేశం మరోసారి పునరుద్ఘాటించింది. దేశంలో ఆడ శిశువుల నిష్పత్తి, ఆడ శిశువుల జననాల నిష్పత్తి తగ్గిపోవడంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. జననానికి ముందే గర్భంలోనే పిండాన్ని తొలగించడం ద్వారా తమకు కావలసిన బిడ్డను ఎంపిక చేసుకునే విధానంపై ప్రస్తుతం సాగుతున్న పోరాటానికి ఇది సంకేతమని సమావేశం భావించింది. కాగా స్త్రీ,పురుష సమానత్వం దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణం పట్ల సమావేశంలో ప్రసంగించిన మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే(ఎస్‌ఆర్‌ఎస్) 2020 నివేదికను మంత్రి ప్రస్తావిస్తూ, 2017 19 మధ్య ప్రతి వెయ్యి మంది పురుషులకు 904 మంది స్త్రీలు ఉండగా 2018 20 నాటికి అది 907కు పెరిగిందని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా సర్వే నిర్వహించిన 22 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాలు ఈ విషయంలో మెరుగుదలను కనబరిచాయని, గర్భధారణకు ముందు, అలాగే గర్భం ధరించిన తర్వాత గర్భస్థ శిశువు నిర్ధారించే పరీక్షలను నియంత్రించడం, బేటీ బచావో, బేటీ పఢావో పథకం అమలు విషయంలో రాష్ట్రాలు కలిసికట్టుగా సాగించిన కృషి ఫలితంగానే ఇది సాధ్యమయిందని మాండవీయ తెలిపారు. 2015లో స్త్రీ, పురుష నిష్పత్తి మధ్య అంతరం 5 పాయింట్లు ఉండగా , 2020 నాటికి అది రెండు పాయింట్లకు తగ్గినట్లు తాజాఎస్‌ఆర్‌ఎస్ నివేదిక వెల్లడించింది. పది రాష్ట్రాల్లో మగవాళ్లకన్నా ఆడవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. కాగా ఐవిఎఫ్, స్కానింగ్ ద్వారా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేసే ఆధునిక టెక్నాలజీలవల్ల ఎదురవుతున్న సవాళ్ల గురించి మంత్రి ప్రస్తావిస్తూ ఈ విధానాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, ఫలితంగా స్త్రీ, పురుష అసమానతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News