Friday, January 10, 2025

భూములు కోల్పోయిన భాధ చాలా పెద్దది.. చేతులెత్తి మొక్కుతున్న: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ బిడ్డలు తనను కడుపులో పెట్టుకొని రెండు సార్లు గెలిపించారని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. తనకు అవకాశమిచ్చాక అభివృద్ధి చేశానని, గజ్వేల్‌కు ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. శుక్రవారం శామీర్‌పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ గజ్వెల్ కార్యకర్తల ప్రత్యేక సమావేశానికి కెసిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్ మదుసూదనా చారి, బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… నోట్ల రద్దు, కరోనా… ఈ రెండింటి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించి అనుకున్నంత చేసుకోలేకపోయామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు రావడంతో రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయని తెలిపారు.

భూములు పోయిన భాధ చాలా పెద్దదని.. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయిన రైతులకు చేతులెక్కి మొక్కుతానని చెప్పారు. వారందరికీ తెలంగాణ యావత్ రైతాంగం ఋణపడి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పారు. తాను పేరుకే గజ్వేల్ ఎంఎల్‌ఎను అని, కానీ ఎక్కడా కనబడనని పేర్కొన్నారు. కానీ ఈసారి ఎన్నికల తరువాత నెలకు ఒకరోజు మొత్తం గజ్వెల్ నియోజకవర్గం ప్రజలతో గడుపుతానని స్పష్టం చేశారు. ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణలో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌తోనే సాధ్యమైందని వెల్లడించారు.

మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నామని, కాంగ్రెస్ వాళ్లు, మరికొందరు వీటిని అడ్డుకున్నారని విమర్శించారు. రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చుకుందామని సిఎం కెసిఆర్ అన్నారు. గజ్వెల్‌లో 65 టిఎంసిల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నామని, ఉజ్వల భవిష్యత్తుకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. గజ్వేల్‌లో మనం గెలువడం కాకుండా పక్కన ఉన్న మూడు నియోజకవర్గాలను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బిఆర్‌ఎస్సే గెలవాలనే అవగాహన ప్రజల్లో ఉందని.. ప్రజల ఆశీర్వాదంతో బిఆర్‌ఎస్ గెలుస్తుందని సిఎం అని సిఎం కెసిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News