శామీర్ పేట: గజ్వేల్‌లో సాధించాల్సిన ప్రగతి ఇంకా చాలా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌ఎన్‌ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ వంటెరు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యరాష్ట్రంలో ఉన్నప్పుడు సాగునీరు, విద్యుత్, ఎరువులు సకాలంలో లభించక రైతులు నరకం అనుభవించారని గుర్తు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రుల దృష్టికి పలుమార్లు రైతుల సమస్యలను తీసుకెళ్లానని అయినా రైతులకు న్యాయం జరుగలేదని విచారం వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాను బహిరంగ లేఖలు సైతం రాశానని అయినా ఫలితం లేకపోయిందన్నారు. విటన్నిటికీ పరిష్కారం తెలంగాణ సాధించుకోవడం ఒక్కటే మార్గమని ఉద్యమ దిశగా అడుగులు వేశామని చెప్పారు.
ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణను దొంగల పాలు చేయొద్దని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఇంత ప్రగతి సాధించామన్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే ఒక రూపుకు వచ్చిందని తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గజ్వేల్ నుంచి తాను అసెంబ్లీకి పోటీచేసి ముఖ్యమంత్రిని అయ్యానని మరొకసారి తనను ఆశీర్వదించాలని కోరారు. గజ్వేల్‌లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని రాష్ట్రమంతట ఇదే పరిస్థితి ఉండటంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికి తాగునీరు అందించమని తెలిపారు. తెలంగాణాలో వ్యవసాయం చరిత్ర సృష్టించాలని వ్యవసాయం చేసే రైతులకు సాగునీరు అందించడానికి కాళేశ్వరం, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ డ్యాంలను నిర్మించామని తెలిపారు. డ్యాముల కోసం రైతులు తమ భూములను ఇచ్చారని వారందరికీ న్యాయం చేశామని ఇంకా ఎవరైనా భూ నిర్వాసితులు ఉంటే వచ్చే టర్మ్‌లో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గజ్వేల్ ప్రజలకు రుణపడి ఉంటానని కరోనా కష్ట కాలంలో ఎవరిని కలువలేకపోయానని ఈసారి నెలకు ఒకసారి మీ అందరితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కారం చేద్దామని కార్యకర్తలకు చెప్పారు.
గజ్వేల్ ప్రజలకు ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి జండ్లు ఇస్తామని అన్నారు. అన్ని జిల్లాలో నూతనంగా కలెక్టరేట్ భవనాలను నిర్మించామని మరికొన్ని భవనల నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కామారెడ్డి నుంచి పోటీ చేయొద్దని గజ్వేల్ ప్రాంత వాసులు కోరుతున్నారని గజ్వేల్ నుంచి రెండుసార్లు పోటీ చేసి తనను ముఖ్యమంత్రి చేశారని ఈసారి ఎంత మెజారిటీ ఇస్తారో మీదే బాధ్యత అన్నారు. మన గజ్వేల్‌లో మన గెలుపు ఖాయమని పక్క నియోజకవర్గ్గలైన మెదక్, నర్సాపురంలపై దృష్టి సారించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. తూప్రాన్‌లో డిగ్రీ కళాశాల కావకాని అడిగారని అలాగే డ్యాముల్లో భూములు కోల్పోయిన వారిని ఆదుకోవాలని వినతిపత్రాలు సమర్పించారు. సిఎం కెసిఆర్ ఈ సమస్యలన్నీ ఒక్కొకటి పరిష్కారం చేసుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, వంటేరు ప్రతాప్‌రెడ్డి. స్పీకర్ మధుసూదనచారీ. ఎంఎల్ సి వంటేరు యాదవరెడ్డి. జడ్పి చైర్మన్ హేమలత. భూమిరెడ్డి. ఎలక్షన్ రెడ్డి. గజ్వేల్ ఎంపిపి అమరావతి. కొట్యాల యాదవరెడ్డి. జహంగీర్. నరోత్తం తదితరులు పాల్గొన్నారు.