Sunday, January 12, 2025

రైతు రుణమాఫీపై ఎవ్వరూ ఆందోళన చెందొద్దు.. త్వరలోనే పూర్తవుతుంది

- Advertisement -
- Advertisement -

రైతు రుణమాఫీపై ఎవ్వరూ ఆందోళన చెందొద్దు.. త్వరలోనే పూర్తవుతుంది
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన లిఫ్ట్ కాళేశ్వరం కట్టుకున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. సిఎం కెసిఆర్ తమను కంటికి రెప్పలా కాపాడుకుంటారని రైతులు భావిస్తున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీపై ఎవ్వరూ ఆందోళన చెందొద్దని, త్వరలోనే పూర్తవుతుందని భరోసా ఇచ్చారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపి రాములు, ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపి మందా జగన్నాథంతో పాటు ప్లువురు నాయ్కులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తమను దొరల పాలన అంటున్నారని, రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి రాచి రంపాన పెట్టారని మండిపడ్డారు. అలాంటి వాళ్లు కూడా దొరల పాలన అనడమా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. దేశంలో 60 ఏండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ నేతలు ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు.

మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని కన్నీళ్లు రెట్టింపు చేశారని కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు. పాలమూరు లిఫ్ట్‌లో ఒక్క మోటార్ నడిస్తేనే కాంగ్రెస్ నేతల కండ్లు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. మొత్తం 31 మోటార్లు నడిస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అనే అంశం చాలా కీలకమైనదని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి పుట్టు పూర్వోత్తరాలు పాలమూరు ప్రజలకు తెలుసునని కెటిఆర్ అన్నారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంది రేవంత్ తీరుని విమర్శించారు. ‘మన కంటిని మనమే పొడుచుకోవద్దు’ అంటూ ఓటర్లను ఉద్దేశించి కెటిఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News