Monday, December 23, 2024

సర్కారు దవాఖానాల్లో సకల సేవలు

- Advertisement -
- Advertisement -

వైద్య, విద్యరంగాలో తెలంగాణ విప్లవాత్మకమైన మార్పు లు తెస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వైద్య, విద్య దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. వైద్య, విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి మనిషి ఆరోగ్యమే మహా భాగ్యం అంటూ వైద్యరంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.ఆరోగ్య తెలంగాణగా అవతరించింది. దేశంలో అన్ని జిల్లాలో మెడికల్ కాలేజీలు వున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. ప్రజా ఆరోగ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య లు పట్ల, తెలంగాణ వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం పెరిగింది. తెలంగాణ వైద్యసేవల్లో దేశంలో టాప్‌గా నిలిచింది. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా తెలంగాణ 33 జిల్లాలో మెడికల్ కాలేజీలను సిఎం కెసిఆర్ ఏర్పాటు చేస్తూ దేశానికి మార్గదర్శకంగా నిలిచారు. తలసరి ఆరోగ్య బడ్జెట్ 2014లో రూ. 925 కోట్లు కాగా, అది 2023 నాటికి 3532 కోట్లకు పెరిగింది. ఆసుపత్రుల పడకలు 17 వేల నుండి 34 వేలకు చేరాయి. ఆక్సిజన్ పడకలు 1400 నుండి 34 వేలు పెరిగాయి. ఎంతో మంది పేద విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుతూ డాక్టర్లుగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా ఇప్పుడు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో 33 జిల్లాలో మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వం ఘనత. ప్రభుత్వ వైద్య కళాశాలలు 2014లో 5 ఉంటే 2023 నాటికి 26కు చేరాయి. నర్సింగ్ కాలేజీలు 5 నుండి 2023 నాటికి 23 ఏర్పాటు చేశారు. మరో 8 మెడికల్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోగ్య తెలంగాణ సంరక్షణ లో పారిశుధ్య కార్మికుల నుండి మొదలు పెడితే ఆశా వర్కర్లు, అంగన్ వాడీ టీచర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యు లు, నర్శులు, అన్ని స్థాయిల్లో సిబ్బంది, వైద్యాధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజలందరికీ వైద్య విద్య అందుబాటులో వున్నప్పుడే ప్రతి పల్లె అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది.గ్రామీణ స్థాయి, బస్తీ స్థాయి నుండి తెలంగాణ వైద్య విద్య రంగంలో విప్లవాత్మకమైన దిశలో దూసుకుపోతుంది. గ్రామీణ మారుమూల పల్లెలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం, వైద్య విద్య అందుతున్నది. సిఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యలు వల్ల ప్రజల జీవితాలు బాగుపడుతున్నాయి.

దేశ చరిత్రలో చెరగని సంతకం.. 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలు, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు. కళాశాలల పక్కా భవనలతో పాటు అన్ని స్థాయిల్లో సిబ్బంది నియామకం, అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు మెడికల్, పారా మెడికల్, పిజి వంటి విద్య రంగంలో సీట్లు పెరిగాయి. 2014లో ప్రభుత్వ కళాశాలల్లో 850 నుండి 2023 నాటికి 3,690 ఎంబిబిఎస్ సీట్ల పెరిగాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 515 నుండి 2023 నాటికి 1320 సీట్లు పెరగడం జరిగింది. హైదరాబాద్ చుట్టూ రూ. 2,679 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం, మరో పక్క నిమ్స్ ఆసుపత్రికి మహర్దశ వచ్చింది. నిమ్స్ ఆసుపత్రి అబివృద్ధికి రూ. 1,571 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న నిమ్స్ 1800 పడకలు, కొత్తగా నిర్మించనున్న ఆసుపత్రిలో మరో 2000 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే నిమ్స్ నూతన ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేశారు. సూపర్ స్పెషాలిటీ సీట్లు 72 నుండి 179కు పెరిగాయి. ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ ప్రొఫైల్ వంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది.

అటు వరంగలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఇప్పటికే కాళోజీ నారాయణ విశ్వవిద్యాలయం ఏర్పాటు అయింది. వరంగల్ నగరంలో అధునాతనమైన వసతులతో కొత్తగా రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 24 అంతస్తులతో ఆసుపత్రిని రూ. 11 వందల కోట్లతో నిర్మిస్తున్నది. గుండె, కిడ్నీ, కాలేయం తదితర అవయవ మార్పిడి ఆపరేషన్లతో పాటు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కీమో థెరపీ, రేడియేషన్, ఆర్థోపెడిక్, డయాలసిస్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఉస్మానియా ఆసుపత్రులు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, సిఎం కెసిఆర్ నాయకత్వంలో వైద్య, విద్యకు పెద్దపీట వేయడం జరిగింది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి చూస్తే ప్రజా ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇటీవలే 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు.
సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల ప్రారంబించారు.

సిఎం కెసిఆర్ సహకారంతో మంత్రి హరీష్ రావు వేయి పడకల ఆసుపత్రిని నిర్మించారు. అత్యాధునిమైన వైద్య సౌకర్యాలతో నూతన మెడికల్ కాలేజీ, ఆసుపత్రి భవనం ప్రారంభం జరిగింది. సిద్దిపేటలో వేయి పడకల ఆసుపత్రి ఏర్పాటుతో హైదరాబాద్, వరంగల్, కరీం నగర్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ ప్రాంతంలో పేద ప్రజలకు అందుబాటులో వైద్యం వచ్చింది.40 పడకల డయాలసిస్ పడకలు ఏర్పాటు, 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేయబోతున్నారు. డయాలసిస్, క్యాన్సర్, ఆర్థోపెడిక్ వంటి ఎన్నో వైద్య సౌకర్యాలు అందుబాటులో వస్తున్నాయి. క్యాన్సర్ బ్లాక్ ఏర్పాటు కూడా శంకుస్థాపన చేశారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు. సిద్దిపేట ప్రాంత ప్రజలకు వేయి పడకల ఆసుపత్రి వరం. కెసిఆర్ కిట్ ద్వారా 14 లక్షల మంది లబ్ధి పొందగా, దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చు చేసింది. కెసిఆర్ కిట్ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014 లో 30 నుండి 2023 ఆగస్టు వరకు 70% మేర ప్రసవాలు పెరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్యరంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రసవాల కోసం మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులకే వచ్చే లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాణ్యమైన వైద్యం అందిస్తుంది.

ప్రత్యేక శిశు సంరక్షణ కోసం 2014లో 2 ఉంటే 2023 నాటికి 35 పెంచడం జరిగింది. ప్రత్యేక నవజాత శిశుసంరక్షణ యూనిట్లు 15 నుండి 55 పెరిగాయి. మాతశిశు ఆరోగ్య కేంద్రాలు 28 నుండి 56 ఏర్పాటు చేశారు. 300 అమ్మ ఒడి వాహనాల ద్వారా మారుమూల పల్లెల నుంచి గర్భిణులను దవాఖానాలకు తరలించే ఏర్పాటు. హైరిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంలో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. బాలింత మరణాలు తగ్గుదల రేటులోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మాతృ మరణాల రేటు 2014లో 92 ఉంటే నేడు 43 శాతం అంటే 50% తగ్గుదల. శిశు మరణాలు రేటు 39 నుంచి 2023 నాటికి 21% తగ్గుదల. రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో మహిళలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా ఈకార్యక్రమం చేపడుతున్నారు. దీంతో 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగుతుంది. కెసిఆర్ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ప్రజల కోసం, మహిళల ఆరోగ్యం, సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 370 బస్తీ దవాఖానాలు కొనసాగుతున్నాయి. వీటిలో వైద్య సేవలతో పాటు 57 రకాల పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు.

బస్తీ దవాఖానాలు ఏర్పాటుతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో పేద ప్రజలకు వైద్యం నిరంతరం అందుబాటులో ఉంది. హెచ్‌ఎండిఎ పరిధిలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బస్తీ దవాఖానాలను 500 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు, 57 రకాల పరీక్షలు, కిడ్నీరోగులకు కోసం 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలు 2014లో 3 ఉంటే 2023 నాటికి 82 కు చేరాయి. 313 డయాలసిస్ మిషన్లను ఏర్పాటు చేసిం ది. రోగుల ఇబ్బంది దృష్ట్యా ఆర్‌టిసి ద్వారా ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తుంది.2018లో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1.54 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు చేసి సమస్యలున్న 41 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు, మందులను ప్రభుత్వం అందించింది.ఈ ఏడాది జనవరి 18న రెండవ విడత కార్యక్రమం కంటి వెలుగు చేపట్టి 80 రోజుల్లో కోటిన్నర కంటి పరీక్షలు నిర్వహించి 39 మంది లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నారు. మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, అయోడిన్ లోపం, ఐరన్ లోపంతో పాటు అనేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. 108 అంబులెన్స్‌లు 2014లో 316 నుండి 455కు చేరాయి. నియో నాటల్ అంబులెన్స్‌లు 2023లో 33 అందుబాటులో వచ్చాయి. 56 బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. నెలసరి సమయంలో మహిళలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృష్ట్యా మంత్రి హరీష్ రావు రుతుప్రేమ కార్యక్రమాన్ని మొదటగా సిద్దిపేటలో ప్రారంభించారు. నీతిఆయోగ్ విడుదల చేసిన ర్యాంకుల్లో తెలంగాణ 2014లో 11 ఉంటే 2023కు 3వ స్థానం నిలిచింది. వైద్యవిద్య రంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ స్ఫూర్తితో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నిరంతరం వైద్య విద్య రంగంలో అనేక చర్యలు తీసుకుంటూ పేద ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News