రఫా: హమాస్ మిలిటెంట్లే లక్షంగా ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో గాజా ప్రాంతం అతలాకుతలమవుతోంది.యుద్ధ పరిస్థితులతో అక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. అన్న పానీయాలు,ఔషధాలు, ఇతర మానవతా సాయం కోసం ఎదురు చూసుతన్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈజిప్టుగాజా సరిహద్దుల్లో దాదాపుగా రెండు వారాలుగా మూతపడిన రఫా సరిహద్దు పాయింట్‌ను శనివారం తెరిచారు. దీంతో ఐరాస సంస్థలు సేకరించిన సామగ్రితో కూడిన వందలాది వాహనాలు ఈజిప్టులోంచి గాజాలోకి ప్రవేశించాయి.ఆ సామగ్రిని చిన్న వాహనాల్లోకి ఎక్కించి గాజాలోని ఇతర ప్రాంతాలకు చేరవేయనన్నుట్లు తెలుస్తోంది. వాస్తవానికి శుక్రవారమే దాదాపు 200 ట్రక్కుల్లో మూడు వేల టన్నులకు పైగా సామగ్రి గాజా సరిహద్దుకు చేరుకుంది. అయితే ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు వీలుగా వాటికి అత్యవసర మరమ్మతులు చేపట్టారు.ఈ ట్రక్కుల శనివారం లేదా ఆ తర్వాత గాజాలోకి ప్రవేశిస్తాయని ఐరాస తెలిపింది.
యుద్ధంనుంచి తప్పించుకుని ఈజిప్టులోకి ప్రవేశించడం కోసం వందలాది మంది విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్న వారు సైతం సరిహద్దుల్లో వేచి ఉన్నారు. వాహనాలు రఫా పాయింట్ మెయిన్ గేట్‌గుండా గాజాలోకి ప్రవేశించే సమయంలో అక్కడి ప్రజలు ఆనందంగా చప్పట్లు చరుస్తూ, నినాదాలు చేస్తూ వాటికి వీడ్కోలు పలకడం కనిపించింది. దాదాపు వారం రోజలు పాటు ఉన్నతస్థాయి దౌత్య యత్నాల తర్వాత రఫా సరిహద్దులు తెరుచుకోవడంసాధ్యమయింది. ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలోకి అన్ని సరఫరాలను నిలిపి వేయంంతో పాటుగా వైమానిక దాడులను ముమ్మరం చేయడంతో ఈజిప్టు రఫా సరిహద్దు పాయింట్‌ను మూసి వేసింది. దీంతో గాజా ప్రాంతంలోని దాదాపు 23లక్షల మంది ప్రజలు ఒక పూట తిండి, మురికి నీటితో బతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ సహా పలు దేశాల నేతలు జరిపిన చర్చల ఫలితంగా మానవతా సాయాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది.
ఇద్దరు అమెరికన్ మహిళలను వదిలిపెట్టిన హమాస్
తమ వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్ మహిళలను హమాస్ విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత రఫా సరిహద్దు పాయింట్ తెరుచుకోవడం గమనార్హం. తమ అధీనంలో ఉన్న ఇద్దరు అమెరికన్లను విడుదల చేశామని హమాస్ సైనిక విభాగం ప్రతినిధి ఒకరు శుక్రవారం ప్రకటించారు.మమానవతా దృక్పథంతో అమెరికాలోని చికాగో ప్రాంతానికి చెందిన తల్లీ కూతుళ్లు జుడిత్ తై రానన్( 59), నటాలీ శోషనా రానన్(17)ను వదిలేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారిని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేశారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. హమాస్ మిలిటెంట్ల స్థావరంనుంచి వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 7న ఇజ్రాయెల్‌గాజా సరిహద్దుల్లోని నహాల్ ఓజ్ కిబ్బట్స్‌నుంచి ఈ ఇద్దరినీ హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. ఆ సమయంలో వారు ఇజ్రాయెల్‌లో హాలిడే నిమిత్తం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు వారాల పాటు హమాస్ చెరలో ఉన్న ఈ ఇద్దరూ విడుదలైన తర్వాత గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ రాయబారిని కలుసుకున్నారు. వారిని సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరానికి తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చాలా సంతోషం: బైడెన్
ఇద్దరు అమెరికన్ల విడుదలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ వార్త తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. విడుదలయిన తర్వాత ఇద్దరు మహిళలతో, వారి బంధువులతో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు. తల్లీ కూతుళ్లు సురక్షితంగా విడుదల కావడంపై వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా హమాస్ వద్ద ఇంకా చాలా మంది బందీలుగా ఉన్నారని, వారి విడుదల కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని బైడెన్ చెప్పారు. హమాస్ వద్ద 200 మందికి పైగా పౌరులు ఇంకా బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మరి కొంతమంది బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఆయా దేశాల పౌరులను విడిచిపెట్టేందుకు ఖతార్, ఈజిప్టు తదితర దేశాలతో కలిసి పని చేస్తున్నట్లు హమాస్ తెలిపింది. కాగా హమాస్ వద్ద ఇంకా 210 మంది పౌరులు బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడిఎఫ్)అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే ఇదే తుది సంఖ్య కాదని ఆయన తెలిపారు. హమాస్ చెరలో ఉన్న బందీల్లో అత్యధికులు సజీవంగానే ఉన్నట్లు ఐడిఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. హమాస్ చెరలోని బందీల్లో 20 మంది చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు పదినుంచి 20 మంది దాకా ఉన్నట్లు తెలిపింది.
గాజాపై భూతల దాడికి అనుమతి
మరో వైపు గాజాలోకి ప్రవేశించడానికి తమ సైనిక బలగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై ఇటీవలి పాశవిక దాడుల్లో పాల్గొన్న హమాస్ ఉగ్రవాదులను గుర్తించి, అంతమొందించడమే తమ లక్షమని పేర్కొన్నారు. హమాస్ సొరంగాలు ప్రపంచంలోనే అతి పెద్ద స్మశానాలుగా మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమ బలగాలు ఎప్పుడు గాజాలోకి అడుగుపెడతాయనే ప్రణాళికల గురించి మాట్లాడబోనని చెప్పారు. అయితే 2005లో తాము వదిలిపెట్టిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఇజ్రాయెల్‌కు లేదని ఆయన చెప్పారు. కాగా గత రెండు వారాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో ఇరువైపులా 5,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. అలాగే లక్షలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల్లో 4.100 మందికి పైగా చనిపోగా, హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మంది దాకా చనిపోయారు. వీరిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు.