Saturday, December 21, 2024

బిఆర్‌ఎస్ గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న ఓవైసి బ్రదర్స్!

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌ను అడ్డుకోవడమే ప్రధాన ఎజెండా
40 నియోజకవర్గాల్లో ప్రభావితం చేయనున్న మైనారిటీలు

మన తెలంగాణ / హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. ప్రధాన పోటీ అధికార బిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఉంది. కొన్ని చోట్ల బిజెపి ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాన సామాజిక వర్గమైన ముస్లిం మైనారిటీలు ఎటువైపు మొగ్గుచూపుతారనే దానిపై రాజకీయ నిపుణులు విశ్లేషణలు కొనసాగిస్తున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎం ఇప్పటికే బిఆర్‌ఎస్‌కు పూర్తి మద్దతు తెలిపింది. పరిమిత స్థానాల్లో పోటీ చేసే ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా మిగతా స్థానాల్లో బిఆర్‌ఎస్‌ను బలపరుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ధ్యేంగా ఎంఐఎం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తాము పోటీ చేసే పాతబస్తీలోని 7 నియోజకవర్గాలు మినహా మిగితా స్థానాల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులను బలపరుచాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి పిలుపునిచ్చిన విషయం విదితమే.

రాష్ట్రంలో దాదాపు 12.7 శాతం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 40 నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించే స్థితిలో ముస్లిం ఓటర్లు ఉన్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌లో ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాలు మజ్లిస్ పార్టీకి పెట్టని కోటలా ఉన్నాయి. కాగా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు.

తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక- 2017 ప్రకారం, హైదరాబాద్‌లోనే 1.73 మిలియన్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు, ఇది నగర జనాభాలో నాల్గవ వంతు, రాష్ట్ర ముస్లిం జనాభాలో 43.5 శాతం నగరంలోని 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో నూ మజ్లిస్ పార్టీకి మంచి పట్టు ఉన్నట్లు భావిస్తున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ముస్లింలు టిఆర్‌ఎస్‌కు మద్దతిచ్చారు. ఈ సారి ముస్లిం ఓట్లు గంపగుత్తగా బిఆర్‌ఎస్‌కు పడకుండా కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు ఓవైసి భ్రదర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత కాంగ్రెస్‌పై ముస్లింలు విశ్వాసం కోల్పోయారు. బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడంలో ఆ పార్టీ విఫలమైందని భావించిన ముస్లింలు బిఆర్‌ఎస్‌కు మద్దతిస్తూ వస్తున్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి మతకలహాలు చోటు చేసుకోక పోవడం, ముస్లిం మైనారిటీల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది.

కెసిఆర్ ప్రభుత్వం ముస్లింల కోసం ప్రత్యేకంగా 204 రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేయడం, 12వ తరగతి వరకు ఉచిత విద్య, భోజన వసతి కల్పించడం, షాదీ ముబారక్ పథకంతో పేమ ముస్లిం అమ్మాయిల పెళ్ళిళ్ళకు ఆర్థిక సహాయం అందించడం, బడ్జెట్ కేటాయింపుల్లో మైనారిటీ బడ్జెట్‌ను భారీగా పెండం, నిరుపేద ముస్లిం విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లు అందజేయడం, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేయడం లాంటి పథకాలు ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ప్రకటించినా అమలు చేయకపోవడాన్ని ముస్లింలలో కొంతమంది వేలెత్తి చూపుతున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు మైనారిటీ ఓట్లు రాల్చనున్నాయని బిఆర్‌ఎస్ కూడా పూర్తి విశ్వాసంతో ఉంది. మరోవైపు ఓవైసి బ్రదర్స్ కూడా మైనారిటీ పథకాలతో పాటు బిఆర్‌ఎస్ మెనిఫెస్టోను ముస్లిం మైనారిటీల్లోకి తీసుకెళ్ళేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు బిఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా ఎంఐఎం దిశా నిర్దేశం చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News