Friday, December 20, 2024

నేడు కివీస్‌తో భారత్ సమరం

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాన్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర పోరు జరుగనుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అజేయ రికార్డును కాపాడుకోవాలని భావిస్తున్నాయి. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు రెండు జట్లకు అందుబాటులో ఉన్నారు. దీంతో ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు ఏదో ముందే చెప్పడం కష్టంగా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో భారత్ అలవోక విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఫామ్‌లో ఉండడం టీమిండియాకు సానుకూలంగా మారింది. కిందటి మ్యాచ్‌లో రోహిత్, గిల్‌లు మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక విరాట్ కోహ్లి కళ్లు చెదిరే శతకం సాధించి అజేయంగా నిలిచాడు.

బ్యాటర్లు ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. కెప్టెన్ రోమిత్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లోనూ మెరుగైన ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరో ఓపెనర్ గిల్ కూడా జోరుమీదున్నాడు. రోహిత్, గిల్‌లు మరోసారి శుభారంభం అందించాలనే పట్టుదలతో ఉన్నారు. కోహ్లి కూడా జోరుమీదుండడంతో భారత్‌కు ఈ మ్యాచ్‌లో కూడా గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి పెద్ద జట్లతో పాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లను చిత్తు చేసింది. ఈసారి కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియాకు సొంత గడ్డపై ఆడనుండడం కలిసి వచ్చే అంశంగా మారింది. సొంత అభిమానుల మధ్య భారత్ మరింత మెరుగైన ఆటను కనబరుస్తోంది. ఈసారి కూడా గెలిచి అజేయ రికార్డును కాపాడుకోవాలని తహతహలాడుతోంది.

జోరుమీదున్న కివీస్..
మరోవైపు న్యూజిలాండ్ కూడా వరుస విజయాలతో ప్రపంచకప్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కివీస్ ఇప్పటికే ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గాన్ జట్లను చిత్తు చేసింది. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. విల్ యంగ్, కాన్వే, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టాప్ లాథమ్, చాప్‌మన్, సాంట్నర్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, సాంట్నర్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కివీస్‌కు కూడా గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయనే చెప్పాలి. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News