ప్రతిపక్ష ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) కూటమిలో లుకలుకలు శ్రుతి మించి రాగాన పడుతున్నాయి. ఇది దాని నౌకను నడి సముద్రంలోనే ముంచివేసి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రొట్టె నేతిలో పడేలా చేస్తుందా? వచ్చే నెల 17న జరగనున్న మధ్యప్రదేశ్ శాసన సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య తలెత్తిన విభేదాలు ఆ కూటమి భవిష్యత్తును అయోమయంలో పడవేసేలా వున్నాయి. అసలే కాంగ్రెస్ పట్ల అనుమానంతో వున్న ఆ కూటమిలోని ఇతర పార్టీలు ఈ పరిణామాన్ని తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ‘ఇండియా’ కూటమిలో పెద్దన్న పాత్ర పోషించగలదనే భయాలను వ్యక్తం చేస్తున్నాయి. సమన్వయ కమిటీ జోక్యం చేసుకొని వ్యవహారాన్ని చక్కదిద్దాలని జెడి(యు) సీనియర్ నాయకుడు కెసి త్యాగి సూచించడం ఇందుకు నిదర్శనం. శాసన సభ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా వున్న కాంగ్రెస్ పార్టీ కూటమిలోని చిన్న పార్టీలకు తగిన చోటు కల్పించవలసిన అవసరమున్నదని ఆయన అన్నారు.
తమకు సీట్లు కేటాయించే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేకపోతే ఆ విషయాన్ని అది ముందే చెప్పి వుండవలసిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్ర స్వరంతో చేసిన ప్రకటన రెండు పార్టీల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయని చాటుతున్నది. కాంగ్రెస్ ఇలాగే ప్రవర్తిస్తే లోక్‌సభ ఎన్నికల్లో యుపిలో దానికి తగిన గుణపాఠం నేర్పుతామని కూడా ఆయన అనడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బొత్తిగా బలం లేదు. ఆ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోడానికి అది పదే పదే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిరకాలం పాటు కాంగ్రెస్ కంచుకోటగా వున్న అమేథీ నుంచే రాహుల్ గాంధీ గెలవలేకపోయారు. దానితో ఆయన కేరళ వైనాడ్ నుంచి లోక్‌సభకు వెళ్ళవలసి వచ్చింది.యుపిలో సమాజ్‌వాదీ పార్టీది పైచేయి. ఇచ్చిపుచ్చుకొనే ధోరణి వున్నప్పుడే కూటములు వర్ధిల్లుతాయి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బిజెపిల మధ్యనే ప్రత్యక్ష పోటీ వున్నది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలుపు సాధించి తీరాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నది.
అయితే ఆ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీకి కూడా అంతోఇంతో బలం లేకపోలేదు. యాదవులు, కుర్మీల ఓట్లు ఎక్కువగా వున్న చోట్ల గతంలో ఎస్‌పి తన అభ్యర్థులను గెలిపించుకొన్న సందర్భాలున్నాయి. అందుచేత ఈ ఎన్నికల్లో దానికి కొద్ది స్థానాలను కాంగ్రెస్ తనంతట తానుగా ఇవ్వజూపి వుండాల్సింది. అక్కడ కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అటువంటి ఔదార్యం చూపలేకపోయారు. కాంగ్రెస్ అధిష్ఠానమైనా ఈ విషయంలో విజ్ఞత ప్రదర్శించి వుండవలసింది. ఎస్‌పి ఆకాంక్షలను దృష్టిలో వుంచుకొని కొన్ని స్థానాలను దానికి కేటాయించవలసిందిగా కమల్ నాథ్‌కు చెప్పి వుండవలసింది. కాని అది జరగలేదు. అందుచేతనే ఈ పేచీ. ‘ఇండియా’ కూటమి నిలబడేది కాదని వారిలో వారే కుములాడుకొని చెల్లాచెదురవుతారని బిజెపి సహజంగానే దాడికి దిగింది. ఈ వివాదాన్ని గురించి కమల్ నాథ్‌తో విలేకరులు ప్రస్తావించినప్పుడు ‘అఖిలేశ్, వఖిలేశ్‌ల సంగతి ఇప్పుడెందుకని ఆయన అన్నట్టు సమాచారం. అఖిలేశ్‌ను వఖిలేశ్ అనడం కూడా సమాజ్‌వాదీ పార్టీ నాయకుల్లో అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగించినట్టు వార్తలు చెబుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 9 స్థానాలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించిందని (వీటిలోని 5 స్థానాల్లో కాంగ్రెస్‌తో పోటీలో వున్నది) తనకు సీట్లను కేటాయించలేదని ఆరోపించే హక్కు, అధికారం దానికి లేవని యుపి కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఐపి సింగ్ అయితే రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా చెరిగి వదిలి పెట్టారు. అతడు తన సోదరుడు వరుణ్ గాంధీనే దగ్గరకు చేర్చుకోలేకపోయాడని, ‘ఇండియా’ కూటమి కాంగ్రెస్ వల్ల ఏర్పడినది కాదని, నితీశ్ కుమార్ కృషి ఫలితమేనని కూడా సింగ్ వ్యాఖ్యానించారు. ‘ఇండియా’ కూటమి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడం కోసం ఏర్పడిందనేది వాస్తవం. అయితే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్ద పార్టీలు కూటమిలోని ఇతర పార్టీలను గమనించి అడుగులు వేయకపోతే అసలుకే మోసం కలగడం సహజం. ఆమ్‌ఆద్మీ పార్టీ రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో అభ్యర్థులను నిలబెడుతున్నదని వార్తలు చెబుతున్నాయి.
అది కూడా ‘ఇండియా’ కూటమిలో భాగస్వామే. అందుచేత కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోకపోతే ప్రతిపక్ష ఐక్యతకు పూడ్చలేని తూట్లు పడడం ఖాయం. ‘ఇండియా’ కూటమి ఏర్పాటు బిజెపిలో వణుకు పుట్టించిన మాట కొంత వరకు వాస్తవమే. కాని ఆ కూటమి అంతర్గత బలహీనతలతో, కీచులాటలతో ప్రజల దృష్టిలో పలచబడుతుండే కొద్దీ బిజెపి తిరిగి పుంజుకొంటుంది.