Monday, December 23, 2024

దీర్ఘకావ్యాలకు మైలురాయి ‘జూలూరు పథం’

- Advertisement -
- Advertisement -

పుస్తకావిష్కరణ సభలో ప్రముఖుల ఉద్ఘాటన

మన తెలంగాణ / హైదరాబాద్ : నాలుగు దశాబ్దాలుగా ఆధిపత్య భావజాలంపై అక్షరతుణీరాలు సంధిస్తూ తెలంగాణ గడ్డపై సాగిన విప్లవ ఉద్యమాల ఊపిరిని పీలుస్తూ సామాజిక అస్తిత్వ తపనలను ప్రతిబింబిస్తూ అనంతర కాలంలో బలమైన ప్రాంతీయ అస్తిత్వ భావాల వెల్లువలా సాగిన ఆత్మకథనాత్మక కావ్యం “జూలూరు పథం” అని పలువురు వక్తలు కొనియాడారు. ముగింపు లేని వాక్యం, ఒడవని ముచ్చటతో ముఖాముఖి సంభాషణ గా “జూలూరు పథం” ప్రగతిశీల ఉద్యమాల ఒరవడిలో సాగిన కావ్యమని అన్నారు.

దీర్ఘకవితల చరిత్రలో, తెలుగు సాహిత్యంలో “జూలూరు పథం” దీర్ఘకావ్యం అత్యున్నత ప్రమాణాలతో తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు వచ్చిన దీర్ఘకావ్యాల్లో అతి పెద్దకావ్యం “జూలూరు పథం” కావ్యమని తెలిపారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక పై అభ్యుదయ, ప్రగతిశీల, ప్రాంతీయ అస్తిత్వవాద కవి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ దీర్ఘకావ్యం “జూలూరు పథం” ఆవిష్కరణ సభలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కవులు, రచయితలు, పలువురు సాహితీవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పండగ రోజైనా..ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులు హాజరుకావడం విశేషం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం ఉదయం జూలూరు గౌరీ శంకర్ రచించిన ‘జూలూరు పథం’ దీర్ఘ కావ్యాన్ని వేదికపై అతిథులు ఆవిష్కరించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ కల్లోల దశాబ్దాల కాలం నుంచి స్వరాష్ట్రం సాకారమైన దశ దాకా వచ్చిన నేపథ్యంలో జూలూరు గౌరీశంకర్ దీర్ఘ కావ్యం సాగిందన్నరు. గౌరీ శంకర్ ప్రగతిశీల ఉద్యమాల్లో కుల అస్తిత్వ ఉద్యమాల్లో తెలంగాణ ప్రాంతీయ ఉద్యమంలో మమేకమై నిత్య చైతన్యశీలిగా నిరంతరం రచనలు చేస్తూ కొనసాగరని కొనియాడారు.

ఈ దీర్ఘకావ్యం వేదన, సంక్షోభం, సంఘర్షణ, ఆక్రోశం, కన్నీళ్లు, చైతన్యాల సమ్మేళనమని చెప్పారు. “జూలూరు పథం” జీవకావ్యం అని అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘ కవితలకు జూలూరు..రోల్ మోడల్ గా నిలిచారని అల్లం పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జూలూరు తన జీవిత నేపథ్యం చెబుతూనే సామాజిక తెలంగాణ పరిణామం చెందుతూ వచ్చిన దశలను డాక్యుమెంట్ విధానంలో కవితాత్మకంగా అక్షరీకరించారని ప్రశంసించారు. కాలానికన్న ముందుకు దూసుకు వెళ్లాలన్న తపన, ఉత్తమ భావాలుగల గౌరీ శంకర్ తాను రాసే ప్రతి అంశం పై నిర్దిష్ట భావాలు, చేసే పని లో స్పష్టత వుంటాయని వివరించారు.

సాహిత్యం పై అవగాహన కార్యదక్షత వున్న గౌరీ శంకర్ సాహిత్య అకాడెమీకి అధ్యక్షుడిగా ఎన్నో సాహితీ విశేషాలకు మార్గం చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ఏకబిగిన ఆసాంతం చదివించే “జూలూరు పథం” దాశరథి చెప్పినట్లు గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యం లా వుందని అన్నారు. తెలుగు సాహిత్యంలో “జూలూరు పథం” ఆత్మకథనాత్మక కావ్యమని అభివర్ణించారు. తెలంగాణ సామాజిక సంఘర్షణలు ఈ కావ్యంలో అడుగడుగునా కనిపిస్తాయని చెప్పారు. తరతరాలుగా బిసిలు అనుభవించిన వేదనను ఒక అస్తిత్వ రూపంలో తీసుకొచ్చినవారు గౌరీ శంకర్ అన్నారు. “వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు” అన్న సంకలనంతో బీసీ ఆస్తిత్వవాదాన్ని తెరపైకి తెచ్చారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ జైత్రయాత్రకు ఈ బిసి బడుగుల పోరాటాలే భూమికగా ఉన్నాయని ఘంటా పేర్కొన్నారు.

ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ ఉక్కుపిడికిలి ఎత్తిననాడు మొదలుకొని, అన్ని ఉద్యమాల్లో జూలూరు గౌరీశంకర్ చురుకైన పాత్ర పోషించాడన్నారు. జర్నలిస్టుగా,కవిగా రచయితగా, ప్రచురణకర్తగా బహు రూపాల్లో జూలూరు కనిపిస్తాడన్నారు. ధిక్కార సంస్కృతి నుంచి వచ్చినవాడు కావడంవల్లే దమ్మున్న కవి అయ్యాడన్నారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తి, విలువలు ఈ “జూలూరు పథం”లో వున్నాయన్నారు. తెలంగాణ వాదాన్ని బలంగా నమ్మి వినిపించిన గౌరీ శంకర్ కావ్య భాష అణగారిన వర్గాల వేదన అని ఆయన అభివర్ణించారు. నేటి కల్లోల సమాజంలో గౌరీ శంకర్ వంటి గొంతుకల అవసరం ఎంతో వుందని పేర్కొన్నారు. సభకు డాక్టర్ యాకూబ్ స్వాగతం పలికారు. ఈ అతిపెద్ద సాహిత్య సభలో ప్రఖ్యాత కవులు సీతారాం, ప్రసేన్, పులికొండ సుబ్బాచారి, సుద్దాల అశోక్ తేజ్, కుప్పిలి పద్మ, ఆశారాజు, ఆనందాచారి, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె నాగేశ్వరరావు, వనపట్ల సుబ్బయ్య, ఘనాపురం దేవందర్, గాజోజు నాగభూషణంలతో పాటు 33 జిల్లాల కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News