మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూర్ వద్ద ఉన్న జూరాల ఇథనాల్ కంపెనీ మా కొద్దు అంటూ చేపట్టిన ఉద్యమం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. గ్రామాల ప్రజలకు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇథనాల్ కంపెనీ నుంచి శనివారం రాత్రి ప్రాణాలకు హాని కల్గించే రసాయనాలతో కూడిన వ్యర్థ పదార్థాలు ఉన్న ట్యాంకర్ వాహనం బయలు దేరుతుండగా విషయం తెలుసుకున్న ఎక్లాస్‌పూర్ ,చిత్తలూరు, జిన్నారం,కన్మనూరు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని వదిలిపెట్టాలని పోలీసులు గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనిషి ప్రాణాలతో పాటు, పశువులు ప్రాణాలకు మొత్తంగా వాయు కాలుష్యానికి కారణమైన ఇథనాల్ కంపెనీ ఇక్కడి నుంచి తరలించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ వలన మా గ్రామాల్లో నీరు కలుషితమై పిల్లలు, పెద్దలకు చర్మ వ్యాధులు వస్తున్నాయని వివరించారు.
గతంలో ఇథనాల్ కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీ వలన ఇప్పటికే పంట పొలాలు కూడా నాశనం అయ్యాయని, మా బతుకులే ప్రశ్నార్ధకంగా మారాయని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముందు వాహనాన్ని వదలాలని, ఏదైనా ఉంటే శాంతియుతంగా ప్రభుత్వంకు చెప్పుకోవచ్చునని పోలీసులు ఆందోళనకారులకు సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రజలు శాంతించక పోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఇద్దరు రైతులకు కాళ్లు విరగగా మరి కొందరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామాల ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు. ఈ దాడిలో సిఐ రాంలాల్‌తో పాటు మరి కొందరు పోలీసులకు గాయాలు అయ్యాయి. అంతటితో ఆగని ప్రజలు పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరి పోలీసులను పట్టుకెళ్లి ఇళ్లలో బందించి తాళాలు వేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. కాగా అదనపు బలగాలు రావడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉంది.
.