Tuesday, November 26, 2024

పోయిరా గౌరమ్మ..

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇక సెలవు, వెళ్లిరావమ్మా! తెలంగాణలో బతుకమ్మ సంబరాలు చివరిరోజు అంబరాన్నంటాయి. ఆడపడుచులు అందంగా ముస్తాబై బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా ఆడిపాడారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తరవాత ఊరేగింపుగా వెళ్లి గౌరమ్మ, బతుకమ్మను స్థానిక చెరువులు, వాగులు, ఇతర నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. ’వెళ్లిరా గౌరమ్మా, వెళ్లిరావమ్మా’ అంటూ బతు కమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధానంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి.

బతు కమ్మ సంబరాలను పురస్కరించుకుని పోలీసులు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాల వద్ద మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. వరంగల్‌లో వేయిస్తంభాల గుడి, హన్మకొండ తదితర ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. వేలాది సంఖ్యలో మహిళలు బతుకమ్మ వేడుకలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి సమీప చెరువు, వాగులలో నిమజ్జనం చేశారు. తెలంగాణ ఆడపడుచులు ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ. పితృ అమావాస్య(పెత్తరమాస) రోజు ప్రారంభమయ్యే ఈ పండుగను 9 రోజులు ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మను తీర్చి దిద్దుతారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవం సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అలా నవ దినములు చేసే బతుకమ్మకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ 9 రోజుల్లో ఎనిమిది రోజులు జరుపుకునే బతుకమ్మ ఒక ఎత్తైతే.. తొమ్మిదో రోజు జరుపుకునే సద్దుల బతుకమ్మ మరో ఎత్తు.

ఈ రోజున బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడు పువ్వుతో బతుకమ్మను సిద్ధం చేస్తారు. పెద్ద తాంబూలంలో బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మను పేర్చేటపుడు తంగేడు పువ్వు, గునుగు, చామంతి, బంతి, గులాబీ, మందారం, ఇలా తీరొక్క పువ్వులతో బహు అలంకరణగా బతుకమ్మను పేరుస్తారు. దీనికి తోడుగా ఉండడానికి తోడు బతుకమ్మను కూడా పేరుస్తారు. ఇది చిన్న సైజులో చేస్తారు. తర్వాత గౌరమ్మను చేసి ఎండు కొబ్బరిలో పసుపు కొమ్ము, వక్కతో పాటు గౌరమ్మను పెడతారు. దీన్ని బతుకమ్మలో పెట్టి పూజిస్తారు. సద్దుల బతుకమ్మ రోజున వివిధ రకాల నైవేద్యాలు చేస్తారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజున మలీద ముద్దలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. కొందరు పిండి వంటలు చేసి ప్రసాదంగా పెడతారు. బతుకమ్మను వాకిట్లో పెట్టి ఆడతారు. మహిళలు ఆటపాటలతో సందడి చేస్తారు. చివరకు బతుకమ్మను గౌరమ్మను పూజించి వెళ్లి రావే బతుకమ్మ అంటూ గంగమ్మ ఒడికి పంపుతారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News