జడ్జిలు ప్రజల పరోక్ష ప్రతినిధులు.. సామాజిక నిర్ణేతలు
పరివర్తనల క్రమంలో సరైన మార్గదర్శక పాత్ర
కోర్టులకు వచ్చే జనంతోనే రాజ్యాంగ సమున్నతి
అమెరికా వేదికగా చర్చాగోష్టిలో భారత ప్రధాన న్యాయమూర్తి
వాషింగ్టన్/న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తుల పాత్ర అత్యంత కీలకమని, వారు ప్రజలతో ఎన్నిక కానప్పటికి, ప్రజలను ప్రభావితం చేసే సమాజ ప్రతినిధులు అని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చెప్పారు. వేగవంతమైన సాంకేతికతో మారుతున్న సమాజ పరిణామాత్మకతలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైనదని తెలిపారు. సమాజంపై అంతర్లీనంగా ఈ వ్యవస్థ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్నారు. అమెరికాలోని జార్జిటౌన్ యూనివర్శిటీ లా సెంటర్, ఢిల్లీకి చెందిన సొసైటీ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ (ఎస్‌డిఆర్) సంయుక్తంగా నిర్వహించిన 3వ సారూప్య రాజ్యాంగ చట్టాల చర్చాగోష్టిలో ప్రధాన న్యాయమూర్తి మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. మారుతున్న సమాజాలు అస్థిరం చెందకుండా చేసే కీలక పాత్రలో న్యాయమూర్తులు ఉన్నారని తెలిపారు.
జుడిషియరీ సమాజస్థిరత్వ ప్రేరేపిత శక్తిని సంతరించుకుందన్నారు. అయితే ప్రజలతో నేరుగా ఎన్నుకోబడని జడ్జిలు అధికారిక వ్యవస్థల పరిధిలో జోక్యం చేసుకోరాదని తలెత్తుతున్న వాదనలపై కూడా చీఫ్ జస్టిస్ స్పందించారు. ఎక్సిక్యూటివ్ పరిధిని ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించడం సముచితమే. అయితే ఇదే క్రమంలో సమాజంలో ఎన్నిక కాకుండానే జస్టిస్‌లు ప్రజలకు పలు విషయాలలో ప్రతినిధులు అయ్యే శక్తిని సంతరించుకుంటారని స్పష్టం చేశారు. ఇది వ్యవస్థల అతిక్రమణ అంశంలోకి రాదని తెలిపారు. భారత్, అమెరికాల సుప్రీంకోర్టుల పరిధిలో వివిధ న్యాయ అంశాల చర్చగోష్టిలో సిజెఐ ప్రసంగించారు. జడ్జిలకు సమాజ స్థిరీకరణ విషయంలో గురుతర బాధ్యత ఉందని, వారిని ప్రజలు ఎన్నుకోకపోవచ్చు.
ప్రతి ఐదేళ్లకోసారి వారి వద్దకు ఓట్ల కోసం వెళ్లకపోవచ్చు, కానీ సమకాలీన సమాజంలో న్యాయవ్యవస్థ ప్రభావం ఎంతైనా ఉందన్నారు. తరుముకుంటూ వచ్చే కాలంతో పాటు తలెత్తే కొన్ని విషమ పరిస్థితులకు కూడా తట్టుకుని సరైన విధంగా వ్యవహరించే శక్తి న్యాయస్థానాలకు ఉందని తెలిపారు. మార్పు సహజం, అయితే మార్పు క్రమంలో తలెత్తే అవలక్షణాల తటస్థీకరణ తద్వారా సమాజ స్థిరత్వం కోసం న్యాయస్థానాలు ఇందులోని అప్రకటిత ప్రజా ప్రతినిధులు అయిన న్యాయమూర్తులు ప్రధాన కర్తలుగా ఉంటారని స్పష్టం చేశారు. భారత్ వంటి బహుళసమాజంలో దేశ సొంత నాగరికతలు, స్వీయ సంస్కృతుల పరిరక్షణలో జుడిషియరీ కీలక పాత్ర ఉందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. సామాజిక మార్పులు, సభ్య సమాజం మధ్య సరైన సమన్వయం ఉండాల్సి ఉంటుంది. లేకపోతే సమాజంలో అవలక్షణాలు తలెత్తుతాయని హెచ్చరించారు.
కోర్టులకు ప్రజలు కేవలం వ్యాజ్యాల పరిష్కారానికి వస్తుంటారని అనుకున్నా, ఇటువంటి వాటితో జరిగేది నిరంతర రాజ్యాంగ మార్పులు చేర్పుల ప్రక్రియ. ఈ విధంగా జనం తమకు తాముగా రాజ్యాంగ ప్రక్రియలో భాగస్వాములు అవుతారని తెలిపారు. పాలనాపరంగా పలు వ్యవస్థలు ఉంటాయి. అయితే జనం న్యాయం కోసం న్యాయస్థానాలను ఎంచుకుంటారని, ఇందుకు పలు కారణాలు ఉన్నాయని తెలిపిన సిజెఐ తాము లెజిస్లేచర్ పాత్ర తీసుకోవడం లేదని, అదే విధంగా ఎక్సిక్యూటివ్ పాత్ర కూడా తమ పరిధిలోకి రాదని, అయితే అన్ని విషయాల సమన్వయ పాత్రలో ఉంటున్నామని తెలిపారు. తన ఉద్ధేశంలో ప్రజానీకం ఈ సమాజం ఏ విధంగా ఉండాలనేది కోరుకుంటారో, దానిని వ్యక్తీకరించేందుకు తగు వేదికలుగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తారని తెలిపారు.
స్వలింగ వివాహాల చట్టం తీవ్రవ్యాధిని మించిన చికిత్స
భారత ప్రధాన న్యాయమూర్తి తమ అమెరికా పర్యటన దశలో గే సెక్స్ మ్యారేజ్‌లపై ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుపై ప్రస్తావించారు. భారతదేశంలో స్వలింగ వివాహాలకు అనుమతిని ఇచ్చేందుకు తగు చట్టం తీసుకువచ్చే బాధ్యత అధికారం కేవలం సంబంధిత లెజిస్లేటివ్ వ్యవస్థ పరిధిలోకి వచ్చే అంశం అని, దీనిని ఇక్కడ కూడా పునరుద్ఘాటిస్తున్నామని తెలిపిన సిజెఐ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే విషయంలో తమ జోక్యం ఉండదన్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లోని కొన్ని నిబంధనలను కొట్టివేయడం లేదా కొన్నింటిని పొందుపర్చడం చివరికి వ్యాధి తీవ్రత కన్నా ఎక్కువ ముప్పు తెచ్చిపెట్టే ప్రిస్క్రిప్షన్ అవుతుందని హెచ్చరించారు.