వ్యవసాయ, వ్యవసాయేతర క్రయ, విక్రయాల్లో తగ్గిన లావాదేవీలు
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.1009.36 కోట్లు రాబడి
వ్యవసాయేతర ఆస్తుల ద్వారా రూ.7103.80 కోట్ల ఆదాయం
ఎన్నికల నేపథ్యంలో తగ్గిన డాక్యుమెంట్‌లు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పడిపోయాయి. 2023 జనవరి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వ్యవసాయ డాక్యుమెంట్ల లావాదేవీలను చూసుకుంటే ఈ ఏడాదిలో లక్షకు పైగా డాక్యుమెంట్ల తగ్గగా, వ్యవసాయేతర భూముల లావాదేవీల డాక్యుమెంట్‌ల గణాంకాలు అదే విధంగా ఉండడం విశేషం. వ్యవసాయ రిజిస్ట్రేషన్లలో దాదాపు రూ.200 కోట్ల రాబడి తగ్గగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో స్వల్పంగా పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం భూముల ధరలు పెరగడం, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో ఈ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయని రియల్‌రంగ నిపుణులు, అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే ఎన్నికలకోడ్ రావడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ (వ్యవసాయేతర భూముల లావాదేవీల) ఆదాయం సైతం ఆశించిన స్థాయిలో రావడం లేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2023-, 24 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన రూ.18,500 కోట్లకుగాను ఇప్పటి వరకు రూ.7103.80 కోట్ల రాబడి రాగా, ఆ శాఖ నిర్ధేశించుకున్న లక్ష్యంలో మొత్తం కలిపితే 38 శాతం మాత్రమే ఆదాయం సమకూరిందని ఆశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ ఆదాయం ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా రావడం లేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గడిచిన ఆరు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గినా స్టాంపు డ్యూటీ, మార్కెట్ విలువలు పెరగడంతో రాబడిలో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్లు కొనసాగితే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా నిర్ధేశించిన లక్ష్యం మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 70 శాతానికి మించి ఆదాయం వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు.
9 నెలల్లో ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం 6,75,885 దరఖాస్తులు
2022 జనవరి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు (9 నెలలు) ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం 6,75,885 దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిలో 6,50,457 దరఖాస్తులకు సంబంధించిన భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది 2023 జనవరి నుంచి సెప్టెంబర్ 30 నాటికి (9నెలలు) భూముల రిజిస్ట్రేషన్ కోసం 5,75,894 దరఖాస్తులు ధరణిలో నమోదయ్యాయి. ఇందులో 5.48 లక్షల దరఖాస్తు లకు సంబంధించిన భూములు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. గతేడాదిలో నమోదైన రిజిస్ట్రేషన్ కంటే ఈ ఏడాది నమోదైన రిజిస్ట్రేషన్లు లక్షకు పైగా తగ్గాయి.
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆదాయంలో స్వల్పంగా కోత
రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గత ఆర్ధిక ఏడాది 2022-,23లో నిర్దేశించకున్న లక్ష్యం రూ.15,600 కోట్లు మొత్తానికి గాను 19.51 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగి రూ.14,291 కోట్లు రాబడి వచ్చింది. ఇది నిర్దేశించిన లక్ష్యంలో 91.21 శాతమని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరం 2023-,24లో ఇప్పటి వరకు 10.66 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా తద్వారా రూ.7103.80 కోట్లు రాబడి వచ్చింది. ఇక ఈ ఆర్ధిక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం రూ.18,500 కోట్లు కాగా, ప్రస్తుతం వచ్చిన ఆదాయంలో ఇది కేవలం 38 శాతమేనని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన రాబడులను పరిశీలిస్తే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆదాయంలో స్వల్పంగా కోతపడగా, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆశించిన మేర రాబడి సమకూరినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ధరణి ద్వారా రూ.1009.36 కోట్లు రాబడి
2023-,24 ఈ ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఏప్రిల్‌లో రూ.149 కోట్లు, మే నెలలో 160.44 కోట్లు, జూన్‌లో రూ.162 కోట్లు, జూలైలో రూ.145.13 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.158 కోట్లు విలువైన ధరణి రిజిస్ట్రేషన్లు జరిగాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు 3.90లక్షల వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ల జరిగి తద్వారా రూ.1009.36 కోట్లు రాబడి వచ్చినట్లు ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యవసాయేతర ఆస్తుల ద్వారా రూ.7103.80 కోట్ల ఆదాయం
అదే విధంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఏప్రిల్లో రూ.851 కోట్లు, మే నెలలో రూ.963.13 కోట్లు, జూన్‌లో రూ.942.15 కోట్లు, జులైలో రూ.851.58 కోట్లు, ఆగస్టులో రూ.966.07 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.958.31 కోట్లు లెక్కన ఆదాయం వచ్చినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్‌లు జరిగినట్టు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబర్ 20వ తేదీ వరకు 6.89 లక్షల వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా ప్రభుత్వానికి రూ.7103.80 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.