Monday, December 23, 2024

‘కశ్మీర్’ కొనసాగింపే ‘న్యూస్‌క్లిక్’

- Advertisement -
- Advertisement -

న్యూస్‌క్లిక్ జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇటీవల చేసిన దాడి కశ్మీర్‌లో చేపట్టిన క్రూరమైన పద్ధతులు, నిస్సిగ్గు చర్యలను అధిగమిస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయి. జర్నలిస్టులు, చురుకుగా పని చేసే కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ఎవరైనా కానిండి మతి తప్పిన ఈ ప్రభుత్వంపై అసమ్మతి తెలిపితే వల విసిరి పట్టేస్తామన్న హెచ్చరిక జారీ చేయడమే ఇది. ‘న్యూస్‌క్లిక్’తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న జర్నలిస్టులు, కంట్రిబ్యూటర్లపైన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ప్రత్యక్షంగా దాడి చేసింది. ఇప్పటికే కశ్మీర్‌లో జర్నలిస్టులు మరణిస్తూ కురిపించే నిప్పుల సెగను తగ్గించిన నేపథ్యాన్ని భారత ప్రభుత్వం అరువు తెచ్చుకుంది. ఈ పోలిక ఇప్పుడు అదృశ్యమైపోయింది. తెల్లవారుజామునే తలుపులు కొట్టి, ఉన్నట్టుండి ఊడిపడినట్టు అనుమానం లేని వ్యక్తులను కూడా లొంగదీసుకొన్నారు. వారి ఎలక్ట్రానిక్ పరికరాలను చట్టవ్యతిరేకంగా స్వాధీనం చేసుకుని, గంటల తరబడి ప్రశ్నించి చాలా ఇబ్బంది కలిగించారు.

చాలా ఏళ్ళ క్రితం తమకు వ్యతిరేకంగా జర్నలిస్టుల రాతలను తమపై ప్రయోగించిన ఆయుధాలుగా తలచి, వాటిని భరించరానివిగా భావించి, అస్పష్టమైన ఆరోపణలు చేశారు. వారిపైన నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని ఇవ్వలేదు సరికదా, ‘న్యూస్‌క్లిక్’ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ పై ‘ఉపా’ చట్టం కింద అనేక ఆరోపణలు చేసి ఆయన్ని అరెస్టు చేశారు. ఇదంతా కశ్మీర్‌లో అణచివేత కొనసాగింపుగానే చేపట్టారు.
గత వారం జరిగిన ఈ సంఘటన ఒక్కటే కాదు. గత కొంత కాలంగా ఆసేతు హిమాచల పర్యంతం ఎంతో పకడ్బందీగా జర్నలిస్టులపైన చేస్తున్న దాడుల్లో భాగంగానే ఈ దాడి జరిగింది. విపరీతమైన స్థాయిలో జరిగిన ఈ దాడి కచ్చితంగా మనం ఊహించనంతటి తీవ్ర పరిణామంగా భావించవచ్చు. పత్రికలపైన, మానవ హక్కుల కోసం పోరాడే వారిపైన, అసమ్మతి వాదులపైన ప్రభుత్వం పెద్ద ఎత్తున తన బలాన్నంతా ప్రయోగిస్తోందన్న విషయం ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది. భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ నరేంద్ర మోడీ పాలనలో అనేక ఇబ్బందులకు గురవుతోంది.

జర్నలిస్టులపై నిఘా పెట్టడం, వారిని నేరస్థులుగా పరిగణించం, నిశ్శబ్దంగా పత్రికల నోళ్ళు నొక్కేయడం, అలా కాకపోతే, వాటిని ప్రభుత్వ అనుకూల వ్యాపారులు స్వాధీనం చేసుకునేలా చేస్తున్నారు. దాంతో పాటు పత్రికలను, వాటి వాహనాలను ప్రభుత్వ అనుకూల ప్రచారానికి ఉపయోగించడం, తప్పుడు వార్తలను, తప్పుడు సమాచారాన్ని, విద్వేషపూరిత ఉపన్యాసాలను ప్రసారం చేయడం, అసమ్మతి వాదులపైన దూషణల పర్వాన్ని కొనసాగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. పత్రికా స్వేచ్ఛ విషయంలో 180 దేశాలకు గాను భారత దేశం 161వ ర్యాంకుకు పడిపోయింది. ఫ్రీ స్పీచ్ కలెక్టివ్ సమాచారం ప్రకారం 16 మంది జర్నలిస్టులపై ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఏడుగురు జర్నలిస్టులు ఇంకా జైళ్ళలో మగ్గుతున్నారు. భారత దేశంలో గత కొన్నేళ్ళుగా పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందో దాని వేగవంత రూపాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది చాలా దారుణంగా వున్నప్పటికీ, అదేమీ నాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. మోడీ ప్రభుత్వం వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీవ్రమైన నిరాశతో తిరుగులేని తన అధికారంతో అడ్డుగోడలు నిర్మించేస్తోంది. ప్రతి విమర్శపైన నిరసన వినిపించినా బలమైన దెబ్బ కొట్టాలని భావిస్తోంది. కశ్మీర్‌లో చేసిన ఒక విజయవంతమైన ప్రయోగంతో సిద్ధమవుతోంది. దానికి ప్రతిరూపంగా ఒక భారతదేశ స్థాయిలో ఒక చిన్న ప్రయోగాన్ని చేసింది. కశ్మీర్‌కున్న ఇబ్బందికరమైన చరిత్ర వల్ల మిగతా భారత దేశంతో పోల్చుకుంటే జమ్ము కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛ, న్యూఢిల్లీ అభద్రత వల్ల, హింసాత్మకమైన ఘర్షణ వల్ల ఎప్పటికీ భిన్నంగానే ఉంటుంది. ఇప్పటికే చేసిన దాడులతో విసుగెత్తిపోయి అలసిపోయిన కశ్మీర్‌పై బిజెపి 2019 నుంచి చివరి దెబ్బ తీయడం మొదలు పెట్టింది.

బిజెపి చేపట్టిన కశ్మీరి ముస్లింల శరీర శాస్త్ర అతిక్రమణతో ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో అది సులభతరమైంది. ఎందుకంటే మిగిలిన భారత దేశంలో జర్నలిస్టులు, మేధావులు, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం తరపున నిలబడడానికి విఫలమైన విషయాన్ని ఎవరు పట్టించుకుంటారు. కశ్మీర్‌లో పత్రికా రంగంపైన 2021లో తీవ్రతరంగా విరుచుకుపడి, అరెస్టులు చేసి, క్రిమినల్ కేసులు పెట్టి, జర్నలిస్టులను చావకొట్టి, కశ్మీరి ప్రెస్‌క్లబ్‌ను బలవంతంగా మూసివేస్తే, దానికి నిరసనగా వివిధ పత్రికా సంఘాల తరపున ప్రకటనలు, కొద్ది మంది జర్నలిస్టుల నుంచి కథనాలు మాత్రమే వచ్చాయి. ఆ సమయం లో దేశ వ్యాప్తంగా ఒక స్థిరమైన ప్రచారం జరిగినట్టయితే బాగుండేది. కారణాలేమైనప్పటికీ అది జరగలేదు.కశ్మీర్‌లో జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా గట్టిగా నోరు విప్పకపోతే ఆ దారుణాలే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయని ఢిల్లీ జర్నలిస్టులకు ఆ సమయంలో నేనొక హెచ్చరిక చేశాను. దానికి చాలా మంది భయపడిపోయి, అది కశ్మీర్‌కు మాత్రమే పరిమితమైందని అన్నారు. నిజానికి అది చాలా తప్పు.

మార్చి 2023లో నూతన డిజిటల్ నిబంధనలు రావడంతో బిబిసి డాక్యుమెంటును నిషేధించి, దాని కార్యాలయంపైన దాడులు చేశారు. కశ్మీరి ప్రయోగం ఎలా పొడిగించారో నేనప్పుడు ఒక వ్యాసం రాశాను. నేను కూడా పొరపాటు పడి ఉండవచ్చు. కశ్మీర్‌లో అనుసరించిన అతి దారుణమైన విధానాన్ని ‘న్యూస్‌క్లిక్’ పై జరిగిన దాడిలో అధిగమించేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణలు ఏమాత్రం అస్పష్టంగా లేవు. జర్నలిస్టులు, చురుకుగా పనిచేసే కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయవాదులు ఎవరైనా కానిండి మతితప్పిన ఈ ప్రభుత్వంపై అసమ్మతి తెలిపితే వల విసిరి పట్టేయాలన్న ఉద్దేశంతో ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో చేసిన చక్కటి ఆరోపణలు ఎలా ఉన్నాయంటే అసోసియేషన్లు, కల్పిత అసోసియేషన్లు తప్పుచేసినట్టు చూపించేలా ఉన్నాయి. ఇది కాస్త కశ్మీర్ వ్యవహారానికి దగ్గరగా కనిపించేలా ఉన్నాయి. ‘న్యూస్‌క్లిక్’ పైన చేసిన ప్రచారం చాలా పెద్దది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో గెలుస్తామో లేదో అన్న నిరాశతో బిజెపి వున్నట్టు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కశ్మీర్‌లో ఏళ్ళ తరబడి సైన్యాన్ని దించి, అణచివేతతో ఎలా చావకొట్టారో, అలాగే దేశ వ్యాప్తంగా ఆ దుస్సాహసమే చేసి దాన్ని మరింత వేగవంతం చేయాలనుకుంటున్నారు. కానీ కశ్మీర్‌లో ఒక క్రమపద్ధతిలో పత్రికా స్వేచ్ఛను తిరస్కరించడం, శాశ్వతంగా భయాన్ని కల్పించడం, సమన్వయంతో మాటిమాటికీ దాడులు చేసి శక్తిలేకుండా నిస్సహాయులను చేయడం వంటివి వారికి ఉపయోగపడే గుణపాఠాలు. వీటితో పాటు ఎవరైతే గట్టిగా నిలబడతారో వారిని చిదిమేయడాన్ని గమనించాను. పాక్షికంగా గాని, పూర్తిగా గాని లొంగిపోయిన వారిని కూడా వదిలిపెట్టలేదు. కశ్మీర్‌లో జర్నలిస్టులు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే కీలకమైన విషయాలపైన రిపోర్టు చేసి తప్పించుకుంటారు. వారిపైన విరుచుకుపడడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
కశ్మీర్‌లో ఏం జరుగుతోందో మనకు ఏమీ తెలియడం లేదు.

ఎందుకంటే, వార్తలు సమాచారం అనే కక్ష్యకు కశ్మీర్ చాలా దూరంగా జరిగిపోయింది. నిర్మోహమాటంగా నిజం చెప్పాలంటే కశ్మీర్ చరిత్ర కానీ, అక్కడి రాజకీయాలు కానీ మిగతా భారత దేశానికి అన్వయించవు. ఈ రెంటినీ కలిపే మచ్చలు మాత్రం రెంటిమధ్య పోలికలకు సరిపోతాయి. కశ్మీర్‌లో పత్రికా రంగంపైన ఉక్కుపాదం మోపినట్టు, ఆసేతు హిమాచల పర్యంతం మోపడానికి దాని వేగం పైన, ఏ స్థాయిలో దానికి ప్రతిఘటన ఏర్పడుతుందనే విషయంపైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రతిఘటన కేవలం జర్నలిస్టుల నుంచి వస్తే సరిపోదు, పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి కీలకమని ఎవరు భావిస్తారో, పౌరులందరికీ ప్రజాస్వామిక హక్కులు కావాలని ఎవరైతే భావిస్తారో వారందరి నుంచి ప్రతిఘటన రావాలి. కాబట్టి మనం తప్పకుండా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడూ మాట్లాడలేం.

మూలం అనురాధ బాషిన్
అనువాదం రాఘవశర్మ
9493226180
(‘ద వైర్’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News