న్యూఢిల్లీ /కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఆసుపత్రిలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న పలువురు తలసేమియా పిల్లలకు కలుషిత రక్తం ఎక్కించారు. దీనితో 14 మంది చిన్నారుల జీవితాలు ప్రశ్నార్థకం అయ్యాయి. వీరు ఇప్పుడు హెచ్‌ఐవి (ఎయిడ్స్), హెపటైటిస్ బి, సి సోకి మరింత విషమ పరిస్థితిలోకి వెళ్లారు. రక్తమార్పిడి దశలో వైద్యుల నిర్లక్షం ఈ చిన్నారులకు ప్రాణాంతకం అయింది.
కాన్పూర్‌లోని లాలా లజపతిరాయ్ (ఎల్‌ఎల్‌ఆర్) ఆసుపత్రిలో జరిగిన ఈ దారుణంపై యుపిలోని స్థానిక మీడియా సంస్థలు పలు కథనాలు వెలువరించాయి. యుపిలో ఉన్న బిజెపి ప్రభుత్వం, పైగా ప్రధాని మోడీ పదేపదే తెలిపే డబుల్ ఇంజిన్ సర్కారు వ్యవహారం ఇదేనా? అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. తలసేమియా వ్యాధితో బాధపడే వారికి రక్తమార్పిడి అవసరం . ఈ సమస్యలతో బాధపడుతున్న 14 మంది చిన్నారులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.
అయితే ఏది పూర్తిగా పరిశీలించకుండా వీరికి రక్తం ఎక్కించడం, ఇది కలుషిత రక్తం కావడంతో వీరిలో ఏడుగురికి హెపటైటిస్ బి, ఐదుగురికి హెపటైటిస్ సి, ఇద్దరికి హెచ్‌ఐవి సోకినట్లు తరువాత వైద్యులు గుర్తించారు. వీరంతా ఆరు నుంచి 16 సంవత్సరాల లోపు వారే . ఇప్పటికే తలసేమియాతో బాధపడుతున్న వీరికి ఇప్పుడు కలుషిత రక్తంతో సోకిన వైరస్‌లు దినదినగండం నూరేళ్ల ఆయుష్షు పరిస్థిని తెచ్చిపెట్టాయని కాంగ్రెస్ నేత ఖర్గే స్పందించారు. ప్రధాని మోడీ పలు విధాలుగా ప్రకటనలు చేస్తూ ఉంటారని, అయితే బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాల జవాబుదారి గురించి ఆయనకు ఆలోచన లేదా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు తలసేమియా తరువాత పలు రకాల వైరస్‌లు సోకిన ఈ పిల్లలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. ఈ పిల్లల గురించి ప్రధాని మోడీ ఏంజవాబు చెపుతారని, తాను ఎంపిగా ప్రాతినిధ్యం వహించే యుపిలో జరిగిన ఈ పరిస్థితికి ఎవరిని బాధ్యులను చేస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రులలో రోగులకు అందుతోన్న రక్తం ఎంతటి కలుషితం అయి ఉంది? ఇందులో ఎన్ని రకాల భయానక వైరస్‌లు ఇమిడి ఉంటున్నాయనేది యుపిలో జరిగిన పరిణామంతో స్పష్టం అయిందని యుపిలోని పలు ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కారులో డబుల్ బీమారీ అయిందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు.