మనతెలంగాణ/హైదరాబాద్:గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన ఘటనపై కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం బుధవారం జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతోపాటు ,బ్యారేజి నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో మేడిగడ్డ ఘటనకు సంబంధించిన వివిధ కోణాలపై సమీక్షించారు. బ్యారేజి నిర్మాణానికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించారు. హైడ్రాలజికి చెందిన అంశాలను కూడా పరిశీలన చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజి శనివారం రాత్రి ఉన్నట్టుండి భారీ శబ్ధంతో కుంగిపోయింది. బ్యారేజి ఏడవ బ్లాకుకు చెందిన 18,19,20 పిల్లర్ల వద్ద వంతెన పైభాగం కొంతమేరకు కుంగింది. 19,20 నెంబర్ పిల్లర్లు నాలుగు అడుగుల మేరకు భూగర్భంలోకి కుంగిపోవటంతో బ్యారేజి పైగాగం కిందకు వంగిపోయింది. సంఘటన జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన స్పందించింది.
నేషనల్ డ్యామ్ సేఫ్టి అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల బృందం మేడిగడ్డ ప్రాంతానికి చేరుకుని బ్యారేజిని నిశితంగా పరిశీలన చేసింది. బ్యారేజిపైనుంచి నిచ్చెనల సాయంతో కిందకు దిగి ఏడవబ్లాకులోని పిల్లర్లను అన్నికోణాలనుంచి తనిఖీ చేసింది. బుధవారం హైదరాబాద్‌లో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షలో మరిన్ని అంశాలపై లోతుగా వివరాలను తెలుసుకుంటూ బ్యారేజి కుంగిపోవటానికిగల సాంకేతిక పరమైన అంశాలను గుర్తించే ప్రయత్నం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులు కేంద్ర బృందం అడిగిన ప్రశ్నలు , లేవనత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ వచ్చారు. బ్యారేజి నిర్మాణంలో పునాదుల దశ నుంచి నిర్మాణం పూర్తయ్యేదాక అన్ని అంశాలను పూసగుచ్చినట్టు కేంద్ర బృందానికి వివరించినట్టు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ ప్రాంతంలో జియాలజికల్ సర్వే నివేదికలను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది.
పిల్లర్లు నిర్మించేందకు భూగర్భంలో ఎంత లోతువరకూ తవ్వకాలు చేశారు, అక్కడి నేల స్వభావం , లోతుకు వెళ్లే కొలది ఎటువంటి నేలపొరలు బయట పడ్డాయి , భూగర్బంలో పిల్లర్ల పునాదుల నిర్మాణం కోసం నేల గట్టిదనం ఎంత తదితర అంశాలను కూడా కేంద్ర బృందం సమీక్షించింది. లూజ్ సాయిల్ ప్రాంతం భూగర్భంలో ఎన్ని మీటర్ల వరకూ వ్యాపించి ఉన్నది కూడా వివరాలు సేకరించింది. భూగర్భంలో లూజ్‌సాయిల్ ఉంటే మేడిగడ్డబ్యారేజికి చెందిన 87పిల్లర్లు కుంగిపోవాల్సివుండగా కేవలం 19,20 నెంబర్ పిల్లర్లే ఎందుకు కుంగిపోయాయి అన్నది కూడా ఆరా తీసింది. ఈ పిల్లర్లు నిర్మించే సందర్భంగా నాణ్యత పరీక్షలు , వాటికి సంబంధించిన రిపోర్టల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. పిల్లర్ల పటిష్టత, నిర్మాణం సందర్బంగా తీసుకున్న జాగ్రత్తలు కూడా కేం ద్ర బృందం సేకరించింది. ఈ రెండు పిల్లర్ల నిర్మాణంలో అప్పటి నీటిపారుదల శాఖ ఎస్‌ఈ , ఈఈ, డిఈ తదితర అధికారుల పాత్రపై కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ అధికారులకు బ్యారేజి నిర్మాణాల్లో ఉన్న అనుభవం , విధినిర్వహణలో వారి పనితీరు అదితర అంశాలపై కూడా ఆరా తీసినట్టు సమాచారం.
క్షేత్ర స్థాయిలో మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించి సేకరించిన సమాచారం, నమూనాల సేకరణ ,వాటికి సంబంధించిన పరీక్షలు, నీటిపారుదల శాఖ అధికారులతో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షలో గుర్తించిన అంశాలు తదితర వాటిని క్రోడీకరించి అన్ని కోణాలనుంచి సమగ్ర విశ్లేషణ అనంతరం ఒక నిర్ణయానికి వచ్చాకే కేంద్ర ప్రభుత్వం నియమించిన అనిల్ జైన్ నేతృత్వంలోని నిపుణుల బృందం నివేదిక సిద్దం చేయనుంది. ఈ నివేదికను కేంద్రజల్ శక్తి మంత్రిత్వశాఖకు సమర్పించనుంది. జలసౌధలో కేంద్ర బృందం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్రనీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ , ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ ఈఎన్సీ నాగేందర్ , కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు ,ముఖ్యమంత్రి ఒఎస్డీ శ్రీధర్‌దేశ్ పాండేతోపాటు మేడిగడ్డ బ్యారేజిని నిర్మాణంలో పాలుపంచుకున్న కాంటాక్టు కంపెనీ ఎల్‌అండ్‌టి ప్రతినిధులతోపాటు నీటిపారుదల శాఖకు చెందిన మరికొందరు ఇంజనీర్లు పాల్గొన్నారు.