Friday, December 20, 2024

పాకిస్థాన్‌కు సవాల్.. నేడు సౌతాఫ్రికాతో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా వరుస విజయాలతో పెను ప్రకంనలు సృష్టిస్తుండగా పాకిస్థాన్ మాత్రమే పేలవమైన ప్రదర్శనతో వరుస పరాజయాలను చవిచూస్తోంది. సౌతాఫ్రికా ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక పాకిస్థాన్ మాత్రం ఐదింటిలో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. భారత్, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన మ్యాచుల్లో పాక్ పరాజయాలను మూటగట్టుకుంది. కిందటి మ్యాచ్‌లో అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చిత్తుగా ఓడించింది. ఈ ఓటమితో పాక్ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఇక సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి పాక్‌కు నెలకొంది. మరోవైపు సౌతాఫ్రికా ఈ వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది.

ఓపెనర్ క్వింటన్ డికాక్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ మార్‌క్రమ్‌లు ఈ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. డికాక్ వరుస సెంచరీలతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో డికాక్ రికార్డు స్థాయిలో 174 పరుగులు సాధించాడు. మార్‌క్రమ్ కూడా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. క్లాసెన్ వీర విహారం చేస్తున్నాడు. వండర్ డుసెన్, రీజా హెండ్రిక్స్, మిల్లర్, మార్కొ జాన్సెన్‌లు కూడా చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలింగ్‌లో కూడా సఫారీ టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

పరీక్షలాంటిదే..
మరోవైపు పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ పరీక్షలాంటిదేనని చెప్పాలి. పసికూన అఫ్గాన్ చేతిలో కూడా ఓటమి పాలు కావడంతో పాక్ పూర్తిగా డీలా పడిపోయింది. ఇలాంటి స్థితిలో పటిష్టమైన సౌతాఫ్రికాతో పోరు పాక్‌కు చావో రేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పాక్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. అప్పుడే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి.

తీరు మారని ఇంగ్లండ్..
బెంగళూరు: ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరున్న ఇంగ్లండ్ ఈసారి వరల్డ్‌కప్‌లో వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులోనే ఇంగ్లండ్‌కు విజయందక్కింది. న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్,సౌతాఫ్రికాలతో జరిగిన మ్యాచుల్లో పరాజయం చవిచూసింది.

పసికూన అఫ్గాన్ చేతిలో కూడా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా చేతిలో అయితే 229 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో బలంగా ఉన్న ఇంగ్లండ్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ పరాజయం తప్పలేదు. ఇలాంటి స్థితిలో ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరడం కష్టంగానే కనిపిస్తోంది. రానున్న మ్యాచుల్లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఇంగ్లండ్ ఎదుర్కొవాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News