ఈ యాత్రలో పాల్గొననున్న కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ విజయభేరి రెండోవిడత బస్సుయాత్ర నేటి నుంచి ఆరు రోజుల పాటు జరుగనుంది. ఈ నేపథ్యంలోనే యాత్రలో పాల్గొనడానికి కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు హాజరుకానున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, ఎల్లుండి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేలు ఈ యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నేడు తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజక వర్గాల్లో డికె శివకుమార్ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు తాండూరులో, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిగిలో, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు డికె శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్లుండి (ఆదివారం) సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ నియోజక వర్గాల్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా…
ఈ రెండోవిడత బస్సు యాత్ర చేవెళ్ల, మెదక్, భువనగిరి, నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరుగుతుందని, వచ్చేనెల 02వ తేదీన ఈ యాత్రను ముగించేలా ప్లాన్‌ను రూపొందించామని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. ఈనెల 02వ తేదీన బహిరంగ సభ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.