Sunday, November 24, 2024

ఘాటెక్కిన ఉల్లి ధరలు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మార్కెట్‌లో ఉల్లి ధరలు ఘాటెక్కుతున్నాయి. రిటైల్‌గా కిలో ఉల్లి ధర రూ.60కి చేరుకుంది. ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతుబజార్లలో కిలో 47రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దేశమంతటా రిటైల్ మార్కెట్లలో ఉల్లి ధరలు గత ఏడాదితోపోలిస్తే ఒక్కసారిగా 57శాతానికి పెరిగిపోయాయి. గత ఏడాది ఇదే సమయానికి కిలో ఉల్లిగడ్డలు రూ.30 ఉండగా, ప్రస్తుతం వీటి ధరలు 47రూపాయలకు చేరాయి. వాతావరణ మార్పుల వల్ల ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి నాట్లు ఆలస్యంగా పడ్డాయి. దీంతో ఈ పంట దిగుబడి వచ్చేందుకు మరో మూడు వారాలు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కొత్త పంట మార్కెట్‌లోకి వస్తేగాని ఉల్లి ధరలు సాధారన స్థితికి చేరేలా లేవంటున్నారు. ఖరీఫ్ సీజన్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలించి సాధారన స్థితిలో సకాలంలో ఉల్లి పైరు సాగు జరిగిఉంటే ఈ సమయానికి ఉల్లిపంట దిగుబడి వచ్చివుండేది.

మార్కెట్లకు కొత్త పంట వచ్చివుంటే ధరలు కూడ ఇంతభారీగా పెరిగే అవాకాశాలు ఉండేవి కాదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లి పంట రాకలో ఆలస్యం వల్లే ఉల్లిమార్కెట్ చైన్ దెబ్బతింది. ఫలితంగా హోల్‌సేల్ ,రిటైల్ మార్కెట్లలో ఉల్లి ధరలకు ఒక్కసారిగా రెక్కలు మొలిచాయి. అంతే కాకుండా కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఉల్లినిల్వలపైన తీసుకున్న ముందు జాగ్రత్తలు కూడా ఉల్లికొరతకు కొంత కారణంగా చెబుతున్నారు. 202324 ఆర్ధిక సంవత్సరానికిగాను ఎన్‌సిసిఎఫ్ ,ఎన్‌ఏఎఫ్‌ఇడిల భాగస్వామ్యంతో వినియోగదారుల శాఖ 5లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను వివిధ గిడ్డంగులలో నిల్వ చేసిపెట్టింది. రానున్న రోజుల్లో వీటికి అదనంగా మరో 2లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను సేకరించి నిల్వచేయాలని లక్షంగా పెట్టుకుంది. మార్కెట్‌లో ఉల్లి కొరతకు ఈ నిల్వలు కూడా కొంత కారణంగా చెబుతున్నారు.

ధరల నియత్రణకు చర్యలు
ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. ఉల్లి ధరలు పెరగకుండా నియంత్రించి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన ఉల్లిగడ్డలను సబ్సిడి ధరలతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. నిల్వ ఉంచిన ఉల్లిని గిడ్డంగుల నుంచి ఉల్లిగడ్డల కొరత ఉన్న రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే దేశంలోని 22రాష్ట్రాలకు 1.7లక్షల మెక్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు. రిటైల్ మార్కెట్లలో ఉల్లి విక్రయాలకోసం ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరెషన్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ పెడరేషన్ సంస్థల ద్వారా ఈ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే మొబైల్ వాహనాల ద్వారా కూడా సబ్సిడీ ధరలతో కిలో ఉల్లి రూ.25కే విక్రయాలు జరపనునట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీలో రిటైల్ ఔట్‌లెట్స్ ,మొబైల్ మార్కెట్ల ద్వారా ఉల్లి విక్రయాలు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News