హైదరాబాద్: తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా మారిందని బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ విమర్శించారు. శనివారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తే సిఎం అవుతారని, ఇతర వర్గానికి చెందిన వ్యక్తి సిఎం కారనేది వాస్తవం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష పదవిలోనూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉంటారని, ఇరత రాష్ట్రాల కూడా బిఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్‌లు వారి కుటుంబ సభ్యులే ఉంటారని ఎద్దేవా చేశారు. ఇతర వర్గం, ఇతర కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వరని దుయ్యబట్టారు.
తెలంగాణ వస్తే బడుగులకు అధికారం వస్తుందని అనుకున్నామని, బడగుల జీవితాల్లో వెలుగు వస్తుంందని మురిసిపోయామని, కానీ ఒక్క కుటుంబంలో మాత్రమే వెలుగు వచ్చిందని, పదవులు వచ్చాయని ఈటల ఎద్దేవా చేశారు. అధికారం ఇచ్చిన ప్రజల బతుకులు ఆగమయ్యాయని, రాజ్యాధికారంలో భాగం ఇస్తామని ఎస్‌సిలను మోసగించారని విమర్శించారు. బిసిల పట్ల బిఆర్‌ఎస్‌కు చులకనభావం, చిన్నచూపు ఉందని దుయ్యబట్టారు. దేశానికి ఒబిసి ప్రధానిని అందించిన ఘనత బిజెపిది అని, గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత బిజెపిది అని విమర్శించారు. కేంద్రంలో 70 శాతానికి పైగా అణగారిన వర్గాలకు చోటుదక్కిందని ప్రశంసించారు.