సిటిబ్యూరోః శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీటర్లపై ఉక్కుపాదం మొపుతామని నార్త్‌జోన్ డిసిపి చందనా దీప్తి అన్నారు. మారేడుపల్లికి చెందిన నలుగురు రౌడీషీటర్లను ఓ కిడ్నాప్ కేసులో శనివారం అదుపులోకి తీసుకున్నారు. మారేడుపల్లికి చెందిన రౌడీషీటర్లు గొల్ల కిట్టు, సన్నీ యాదవ్, చిరాబోయిన కృష్ణయాదవ్, బిండ్లని విశ్వందర్, ఏ. రవీందర్‌రెడ్డి, చందర్ ప్రభువును అరెస్టు చేశారు. రౌడీషీటర్లు కలిసి గత నెల 8వ తేదీన ఓ వ్యక్తిని కిడ్నాప్‌కు యత్నించారు. గతంలో బాధితుడితో వీరికి గొడవ జరిగింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాద చేయడంతో మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు విత్‌డ్రా చేసుకోవాలని లాయర్ ద్వారా సమాచారం పంపినా కూడా వినకపోవడంతో కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉండగా, పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఉన్న రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్నామని , వారిని అరెస్టు చేస్తామని డిసిపి చందనా దీప్తి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు రౌడీషీటర్లు, అల్లరి మూకలను అరెస్టు చేస్తామని తెలిపారు.