Monday, November 25, 2024

గాజాలో మానవతా సంధికి ఐరాస తీర్మానం

- Advertisement -
- Advertisement -

ఐక్యరాజ్య సమితి: ఇజ్రాయెల్ హమాస్ వివాదంలో తక్షణ మానవతా సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్ హాజరయింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే ప్రతిపాదనలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్య దేశాలున్న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌లో మొత్తం179 దేశాలు పాల్గొన్నాయి.ఈ ప్రతిపాదనకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేయగా, 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45దేశాలు ఓటింగ్‌కు గైర్ మాజరు కాగా అందులో భారత్ కూడా ఉంది. భారత్‌తో పాటుగా ఆస్ట్రేలియా, కెనడా,జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యుకె ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.‘ పౌరుల రక్షణ, చట్టబద్ధమైన మరియు మానవతా బాధ్యతలను సమర్థించడం’ పేరిట జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్,దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు తీర్మానానికి మద్దతు ఇచ్చాయి.గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న వారికి మానవతా దృక్పథంతో సహాయం అందించడం,వారికోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఈ తీర్మానంలో ఉన్నాయి.

ఉగ్రవాదంపై స్పష్టమైన సందేశాన్ని పంపించాలి:
అయితే ఓటింగ్‌కు దూరంగా ఉండడానికి గల కారణాలను భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావనా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పుబట్టింది. ఉగ్రవాదం విషయంలో ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపించాల్సిన అవసరం ఉందని భారత్ తెలిపింది. ‘ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేవాన్ని పంపుతాయని, దౌత్యం చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని ఐక్య్యరాజ్య సమితిలో భారత దేశ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. ‘అక్టోబర్ 7న జరిగిన ఉగ్రదాడి దిగ్భ్రాంతి కలిగించింది.దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఆలోచనంతా బందీలుగా మారిన వారి గురించే . ఎటువంటి షరతులు లేకుండా వారిని తక్షణమే విడుద చేయాలని పిలుపునిస్తున్నాం. ఉగ్రవాదం ప్రాణాంతకమైనది. దానికి ఎలాంటి హద్దులూ లేవు.ఇలాంటి ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్థనా ఉండకూడదు.

విభేదాలు పక్కన పెడతాం.ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదు. అలాగే మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉద్రిక్తతలు తగ్గించడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషి, గాజాకు అందిస్తున్న సహాయాన్ని అభినందిస్తున్నాం. దీనికి భారత్ కూడా తన వంతు సాయం అందించింది. శాంతి చర్చలకు అనువైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కృషి చేయాలి. ఈ దిశగా సభ స్పష్టమైన సందేశాన్ని పంపుతుందని ఆశిస్తున్నాం’ అని ఓటింగ్‌కు గైర్ హాజరుపై ఇచ్చిన వివరణలో భారత్ స్పష్టం చేసింది. కాగా, ఓటింగ్‌కు ముందు అమెరికా మద్దతుతో కెనడా తీర్మానానికి ఒక సవరణ ప్రతిపాదించింది.ఆ పేరాను తీర్మానంలో చేర్చాలని కోరింది. అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు , అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఎలాంటి షరతులు లేకుండా బందీలను తక్షణం విడుదల చేయాలని ఆ సవరణలో పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనకు భారత్ సహా 87 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. 55 దేశాలు వ్యతిరేకించగా, 23 దేశాలు దూరంగా ఉన్నాయి. అయితే ఆ సవరణకు అవసరమైన మెజారిటీ రాకపోవడంతో దానిని తీర్మానంలోకి తీసుకోవడం వీలు పడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News