బిజెపిలో తనకు గౌరవం లేదు!
రాజకీయాలకు దూరంగా ఉంటా!!
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకే దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీ తరుపున ప్రచారం కూడా చేయనని తేల్చి చెప్పారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిజెపి పార్టీలో ఐదేళ్లుగా పని చేస్తున్నానని ఇటీవలే నియోజకవర్గం సమావేశం కూడా నిర్వహించానని, అలాంటి నాకు మొదటి జాబితాలో నా పేరు ఎందుకు లేదని పార్టీ సీనియర్లను ప్రశ్నించారు. ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవటం తనకు తలవంపులుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఎందుకు ఇవ్వటం లేదనే విషయాన్ని కూడా చెప్పకపోవటం బాధ కలిగించిదన్నారు.
నా గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు, నా కొడుకు మధ్య చిచ్చు పెడుతున్నారని.. ఉన్నదే ఒక్క కొడుకు అని, మా మధ్య ఎందుకు చిచ్చు పెడతున్నారని.. ఉరి తీసేవాడికి కూడా చివరి సారిగా అవకాశం ఇస్తారని పేర్కొన్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా.. ఫోన్లు కూడా ఎత్తటం లేదని, పార్టీలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎందుకు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ పెద్దలతో మాట్లాడి వాళ్ల వైఖరి ఆధారంగా బిజెపిలో ఉండాలా, లేదా? అనేది నిర్ణయించుకుంటానని స్పష్టం చేశారు.