న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో నిత్యావసరాలు డెలివరీ చేయడానికి వెళ్లిన డెలివరీ బాయ్ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీస్‌లు గాలించగా దొరికినట్టే దొరికి వాళ్ల నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈనేపథ్యంలో సాయుధ పోలీస్ బలగాలు రంగం లోకి గాలించాయి. చివరికి నిందితుడి కాలిపై పోలీస్‌లు కాల్పులు జరిపి అదుపు లోకి తీసుకోగలిగారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
గ్రేటర్ నోయిడా లోని హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మహిళ అవసరమైన సరకులను యాప్‌లో ఆర్డర్ చేసింది. ఆ సరకులను తీసుకొని 23 ఏళ్ల డెలివరీబాయ్ సుమిత్‌సింగ్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉండడం గమనించి ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీస్‌లు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు.
మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అతని ఉనికిని గుర్తించారు. వాళ్లకు లొంగిపోయినట్టు నిందితుడు సుమిత్ సింగ్ నటించాడు. అంతలోనే ఓ పోలీస్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరారయ్యాడు. వెంబడిస్తున్న పోలీస్‌లపై కూడా కాల్పులు జరిపాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్‌లు అతడి కాళ్లపై ఎదురు కాల్పులు జరిపి అదుపు లోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు నోయిడా పోలీస్‌లు వెల్లడించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత కోర్టు ఎదుట హాజరు పరుస్తామని పోలీస్‌లు తెలిపారు. గతంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నాడన్న కారణపై సుమిత్‌పై కేసు నమోదైంది.