భగ్గుమన్న పార్టీ క్యాడర్.. పోటీ చేయాల్సిందేనంటూ ఆందోళన
ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో కాసాని సమావేశం అడ్డగింత
కార్యకర్తల నినాదాలతో హోరెత్తిన కార్యాలయం
మరోసారి అధినేత దృష్టికి తీసుకెళ్తానని హామీ.. అయినా శాంతించని క్యాడర్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టి టిడిపి దూరం అయ్యింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసానినే స్వయంగా పార్టీ నేతలకు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఎన్‌టిఆర్ భవన్‌లో నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించిన తెలంగాణ తెలుగుదేశం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించినట్లు పార్టీ శ్రేణులకు తెలిపారు. ఎన్నికల్లో పోటీ వద్దన్న పార్టీ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గు మన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పార్టీనే నమ్మకుని ఏళ్లుగా ఉన్నామని, ఎన్నికల్లో పోటీ చేయక పోతే తమ పరిస్థితి ఏంటని వారు కాసానిని నిలదీశారు.
ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఏడాది నుండి కష్టపడుతున్నానని, తనకూ శాసనసభకు వెళ్లాలనే ఉందన్నారు. తాను మాత్రమే కాదు..తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది నా ఆలోచన అన్నారు. రేపో మాపో లోకేశ్ బాబుతో చర్చించి పార్టీ క్యాడర్ అభిప్రాయాలను వివరిస్తానని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ ఎంత చెప్పినా..నేతలు, కార్యకర్తలు వినలేదు. దీంతో సుమారు గంట పాటు ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో నినాదాలు మారుమ్రోగాయి. తాము పోటీ చేస్తామని, టిక్కెట్లు ..బిఫామ్‌లు ఇవ్వాల్సిందేనంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతే అధినేత చంద్రబాబును, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్దకు తమను తీసుకెళ్లాలంటూ వారు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కాసాని ఎంత చెప్పినా వారు వినక పోవడంతో మరో సారి ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తానని శాంతించాలని కాసాని పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా వినకుండా వి వాంట్ టికెట్స్.. వి వాంట్ బి ఫామ్స్.. ఏ ఫామ్స్ అని నినాదాలు చేయడంతో ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ ఆందోళనలతో దద్దరిల్లి పోయింది.
పోటీ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టి టిడిపి దూరం అంటూ పలు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను తీసుకుని టి టిడిపి శేణులు ఎన్‌టిఆర్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. మీరు టిక్కెట్లు మాత్రమే ఇవ్వండి గెలిచి చూయించే బాధ్యత మాది.. మేం అడుగుతున్నది సీట్లే.. నోట్లు కాదు..
పోటీకి అధిష్టానం దూరం అంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ టి టిడిపి నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎల్ బి నగర్ నియోజక వర్గం నుండి ఎస్.వి. కృష్ణ ప్రసాద్, అంబర్‌పేట నియోజకవర్గ ఇంఛార్జ్ బిల్డర్ ప్రవీన్ ఆధ్వర్యంలో టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిసి ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేసేలా చూడండని వారు కోరారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా.. అధిష్టానందే తుది నిర్ణయం అంటూ ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, తాను పోటీ చేయాలనే ఇన్నాళ్లు పార్టీని బతికించుకుంటున్నానని కాసాని స్పష్టం చేశారు. టిక్కెట్లు కేటాయిస్తూ తాను బి ఫాంలు ఇచ్చినా ఏ ఫాంలు ఇచ్చేది చంద్రబాబు నాయుడే కదా.. ఆయన అనుమతి లేకుండా ఎన్నికల్లో పోటీ సాధ్యమేనా? అంటూ పార్టీ నేతలను, కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
లోకేశ్ తో మారో సారి భేటీ
కాగా ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ టి టిడిపి నాయకులు చేసిన ఆందోళన ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాసాని ఎంత చెబుతున్నా.. క్యాడర్ మాత్రం వినే స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో భవిష్యత్ ప్రణాలికలు ఎలా ఉండాలి? పార్టీ క్యాడర్ నుండి వ్యతిరేకత రాకుండా ఎలా చూసుకోవాలి అన్న దానిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో నేడో , రోపో సమావేశం కావాలని కాసాని నిర్ణయించుకున్నారు. కొందరు ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్లో ధర్నా నిర్వహించగా.. మరి కొందరు నారా లోకేశ్ హైదరాబాద్‌లోనే ఉన్నారంటూ ఆయనను కలిస్తామంటూ మరి కొందరు జూబ్లిహిల్స్‌లోని లోకేశ్ ఇంటి వైపు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.