Monday, December 23, 2024

వివాహ హక్కుకు తిరుగులేదు: ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పెళ్లంటే మూడు ముళ్లు ఏడడగుల బంధమే , అంతకు మించి ఇది మానవ స్వేచ్ఛ సంబంధిత ప్రధాన ఘట్టం, జీవితాన్ని మలుపు తిప్పే ఘటన అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే యుక్త వయస్కులకు వివాహ హక్కు రాజ్యాంగబద్ధం అని , దీనిని ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని న్యాయస్థానం తెలిపింది. తల్లిదండ్రులు, సమాజం, లేదా ప్రభుత్వ యంత్రాంగం లేదా రాజ్యపు కట్టుబాట్లు ఏవీ కూడా ఈ హక్కును కాదనరాదని తేల్చిచెప్పారు. మానవ స్వేచ్ఛ సంబంధితమైన వివాహం రాజ్యాంగబద్ధమైన జీవించే హక్కులో అంతర్భాగంగా నిలుస్తుంది. వ్యక్తుల రాజ్యాంగయుత హక్కులను ఏ శక్తి అడ్డుకోవడానికి వీల్లేదని హైకోర్టు న్యాయమూర్తి సౌరభ్ బెనర్జీ ఇటీవల వివాహ సంబంధిత వ్యాజ్యం తీర్పులో తెలిపారు. కుటుంబ సభ్యులు, సమాజం నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని, తమకు పోలీసు రక్షణ కల్పించాలని ఇటీవలే దంపతులుగా మారిన జంట దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.

సంబంధిత పోలీసు వర్గాలు ఈ దంపతులకు సరైన భద్రతను కల్పించాలని న్యాయమూర్తి తమ తీర్పులో ఆదేశించారు. వ్యక్తులు తమ జీవితాన్ని తమదైన రీతిలో మల్చుకునేందుకు పరస్పర అంగీకారంతో ముందుకు వస్తే, వారిని ఈ విధంగా వివాహబంధంతో ముందుకు సాగనివ్వాల్సిందే. దీనిపై ఎటువంటి అభ్యంతరాలు ఉండరాదు. అడ్డంకులు బెదిరింపులు పనికిరావని జస్టిస్ బెనర్జీ స్పష్టం చేశారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు, తీసుకునే నిర్ణయాలకు సామాజిక సమ్మతి అవసరం లేదని తెలిపారు. పిటిషనర్లు వారికున్న జీవించే హక్కు పరిధిలోనే వ్యవహరించారని, దీనికి చట్టపరమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తమ నిర్ణయం తాము తీసుకునే దశకు వచ్చినప్పుడు అటువంటివారి జీవితాలలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికి లేదు. ఈ ప్రస్తావనే రాదని కోర్టు తేల్చిచెప్పింది. తాము ఈ నెలారంభంలో పరస్పర ఇష్టంతో ముస్లిం పద్థతిలో పెళ్లిచేసుకున్నామని , అయితే తీవ్ర పరిణామాలు తప్పవని తమ వైపు వారు బెదిరిస్తున్నారని యువతి తెలియచేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News