న్యూఢిల్లీ : దేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. నెల రోజుల క్రితం తక్కువ రేటులో ఉన్న బంగారం ఇప్పుడు కొనాలనుకునే వారికి ఇప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బంగారం ధర వరుసగా మూడు వారాలుగా పెరుగుతూ ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో రూ.62,000కి చేరువలో ఉంది. రిటైల్ మార్కెట్‌లో బంగారం ధరను పరిశీలిస్తే, దేశంలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,500పైన కొనసాగుతోంది. నవంబర్‌లో ధన్‌తేరస్, దీపావళి రానున్నందున ఈ నెలలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నవంబర్ 10న ధన్‌తేరస్, నవంబర్ 12న దీపావళి సందర్భంగా భారీగా బంగారం కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. ఈ పండుగ సీజన్‌లో బంగారం, వెండి ఆభరణాలు, బహుమతి వస్తువులు, నాణేలు మొదలైనవి ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి జోరు పెరిగినప్పటికీ ప్రపంచ మార్కెట్‌లో మాత్రం బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్సుకు 2,000 డాలర్లు దాటింది. ఇప్పటికే అక్టోబర్ నెలలోనే ఈ గరిష్ఠానికి చేరుకుంది. గతేడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం రేటు పెరగ్గా, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న విభేదాలు, ఉద్రిక్తతల కారణంగా మళ్లీ గోల్డెన్ మెటల్‌పై పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతోంది. బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మళ్లీ బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. 2023 జనవరి నుండి బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. జనవరిలో ప్రపంచ బంగారం ధర ఔన్సుకు 1,823 డాలర్ల వద్ద ఉంది. అయితే 2023 మే నాటికి బంగారం ధర ఔన్సుకు 2,051 డాలర్లకు చేరుకుంది.
అక్టోబర్‌లో బంగారం ధరలు మరోసారి ఔన్సుకు 1820 డాలర్లకు పడిపోయినప్పటికీ, దీని తరువాత బంగారం పెరుగుదల చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 25 రోజులలో బంగారం మరోసారి ఔన్స్‌కు 2,005 డాలర్ల రేటుకు వచ్చింది. సోమవారం బంగారం ఔన్స్ రేటు 2,016.70 డాలర్లకు చేరుకుంది. ఈ అక్టోబర్‌లో ఆస్ట్రేలియా, జపాన్, చైనా, తైవాన్‌తో సహా మరికొన్ని దేశాల్లో బంగారం బలమైన పెరుగుదలతో ట్రేడవుతోంది. ఈ దేశాలలో జీవితకాల గరిష్ఠానికి రేటు చేరుకుంది.
హైదరాబాద్‌లో బంగారం ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ. 62,630 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 10 పెరిగి ప్రస్తుతం రూ. 57,410కి చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 10 పెరిగి రూ. 62,780 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం రూ.10 పెరిగి రూ. 57,560 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 77,500 వద్ద ట్రేడవుతోంది. అలాగే ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 74,600 వద్ద ఉంది.