న్యూఢిల్లీ : తాను ఇండియా కూటమిని వీడనున్నట్లు సమాజ్‌వాది పార్టీ నేత, యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఇందుకు కాంగ్రెస్ పెత్తనపు వైఖరి కారణం అని ఆయన సోమవారం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ ప్రదర్శించిన తీరు అనుచితంగా ఉందని అఖిలేష్ విమర్శించారు. ఇతర పార్టీలు బలం లేదని అనుకునే పెత్తనపు వైఖరి కాంగ్రెస్‌లో పాతుకుపోయిందని, ఇది మారదని ఈ నేత విమర్శించారు. ప్రతిపక్ష ఐక్యతకు తాము కట్టుబడి ఉంటామని, అయితే ఆధిపత్య ధోరణిని ప్రదర్శించే పార్టీ సారధ్యం ఉంటే ప్రతిపక్ష కూటమి ముందుకు సాగుతుందా? అని అఖిలేష్ ప్రశ్నించారు. తాను ఎన్‌డిఎకు కూడా దూరమని, ఇండియా కూటమికి కాంగ్రెస్ వల్ల దూరం అవుతున్నామని తెలిపిన ఎస్‌పి నేత తమది ఇక పిడిఎ అని తేల్చిచెప్పారు.
పిడిఎ అంటే పిచ్డే (వెనుకబడిన) దళిత వర్గాల కూటమి అని వివరించారు. తాము పిడిఎ నినాదంతోనే ప్రజల వద్దకు వెళ్లుతామని, బిజెపిని దెబ్బతీసేందుకు ఇండియా కూటమితో పోలిస్తే పిడిఎ నినాదమే బలీయం అయిందని ప్రకటించారు. అయితే పిడిఎ తమ పార్టీ పంథా అని పేర్కొన్నారు. ఇండియా ఓ రాజకీయ కూటమి అన్నారు. పిడిఎ ముందు పుట్టింది. ఇండియా తరువాత వెలిసిందని , నిజానికి ఇండియాకు చిత్తశుద్ధి ఉంటే ఈ పిడిఎ మార్గాన్నిసొంతం చేసుకుని తీరాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో తమకే బలం ఉందని , ఎస్‌పికి కోరిన విధంగా 18 సీట్లు ఇవ్వడం కుదరదని, ఆరు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పేర్కొనడం ఎస్‌పికి కాంగ్రెస్‌కు మధ్య వివాదానికిదారితీసింది.