Friday, December 20, 2024

నవంబర్ 2న కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారేమో: ఆప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సయిజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు నవంబర్ 2న తమ ఎదుట హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదే రోజు ఆయనను అరెస్టు చేసే అవకాశముందని ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ఁదందోళన వ్యక్తం చేసింది. తమ పార్టీ అగ్ర నాయకులను జైలుకు పంపి పార్టీని అంతం చేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని కూడా ఢిల్లీలోని అధికార పార్టీ ఆరోపించింది.

పిఎంఎల్‌ఎ చట్టం కింద అరవింద్ కేజ్రీవాల్‌కు ఇడి సమన్లు జారీచేసింది. నవంబర్ 2న ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్ ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో హాజరైన తర్వాత ఆయన వాంగ్మూలాన్ని ఇడి అధికారులు నమోదు చేస్తారని వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్‌కు ఇడి సమన్లు జారీచేయడం ఇదే తొలిసారి. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు.

ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని తెలిసే ఆప్‌ను అంతం చేయడానికి బిజెపి ఈ ఎత్తుగడలకు పాల్పడుతోందని ఢిల్లీ మంత్రి ఆటిషి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. నవంబర్ 2న కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారని తమకు సమాచారం ఉందని ఆమె తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే జరిగితే దానికి కారణం అవినీతి కాదని, బిజెపికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడమేనని ఆమె అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకసారి బిజెపిని ఆప్ చిత్తుగా ఓడించిందని, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని ఆతిషి ఆరోపించారు. ఆప్‌ను ఎన్నికల్లో ఓడించలేమన్న విషయం బిజెపికి బాగా తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు.

ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్‌తోసహా ఆప్ అగ్ర నేతల అరెస్టును ఆమె ప్రస్తావిస్తూ ఆప్‌ను అంతం చేయాలన్నదే బిజెపి లక్షమని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన నాయకులను బిజెపి టార్గెట్ చేస్తుందని, ఇండియా కూటమికి చెందిన ముఖ్యమంత్రులతోపాటు ఆ కూటమి అగ్రనేతలపై సిబిఐ, ఇడిని బిజెపి ప్రయోగిస్తుందని ఆతిషి ఆరోపించారు.

వాళ్ల(బిజెపి) తదుపరి టార్గెట్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ఆయనను ఓడించలేమన్న కారణంతోనే ఇడిని ప్రయోగిస్తారు. బీహార్‌లో అధికార జెడియు, ఆర్‌జెడి కూటమిని విచ్ఛిన్నం చేయలేకపోవడం వల్లే తేజస్వీ యాదవ్‌ను కూడా టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కూడా టార్గెట్ చేస్తారు q అని ఆతిషి ఆరోపించారు.

జైలుకు వెళ్లడానికి ఆప్ నాయకులు భయపడే ప్రసక్తే లేదని, తమ తుది శ్వాస వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటారని మంత్రి ఆతిషి స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News