న్యూఢిల్లీ: సత్తా ఉంటే జమ్మూ కశ్మీరులో ఎన్నికలు నిర్వహించాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా బిజెపికి సవాలు విసిరారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే బిజెపి 10 స్థానాలు కూడా గెలవలేదని ఆయన జోస్యం చెప్పారు.
జమ్మూ కశ్మీరులోని కుప్వారా జిల్లాలో మంగళవారం ఒక బహిరంగ సభలో ఓమర్ అబ్దుల్లా ప్రసంగిస్తూ దమ్ముంటే జమ్మూ కశ్మీరులో ఎన్నికలు నిర్వహించాలని బిజెపికి సవాలు విసురుతున్నానని చెప్పారు. జమ్మూ కశ్మీరు వ్యాప్తంగా ఉన్న 90 స్థానాలలో కనీసం 10 స్థానాలను కూడా బిజెపి గెలవలేదని ఆయన ఎద్దేవా చేశారు. జమ్మూ కశ్మీరులో ఎన్నికలు నిర్వహిస్తే బిజెపితోపాటు దాని బి, సి, డి టీమ్‌లన్నిటినీ ఓడిస్తామని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో జమ్మూ కశ్మీరులో బిజెపి పాల్పడిన విధ్వంసం, వినాశనం ఊహించలేనిదని ఆయన అన్నారు.
నిరుద్యోగ యువత నుంచి ముడుపులు పుచ్చుకున్నారని, బడా కంపెనీల నుంచి లంచాలు పుచ్చుకున్నారని, ఇతర శాఖలలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని ఓమర్ చెప్పారు. ఎన్నికలు నిర్వహిస్తే తమ బండారం బయటపడుతుందని బిజెపికి తెలుసని, అందుకే ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు. లడఖ్ ఎన్నికల్లో ప్రజల అసమ్మతి ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే చవిచూశారని, 26 స్థానాలలో కేవలం 2 స్థానాలు మాత్రమే బిజెపి గెలుచుకోగలిగిందని ఆయన అన్నారు.
ఈ రోజు కాకపోయినా రేపయినా, ఎల్లుండయినా జమ్మూ కశ్మీరులో ఎన్నికలు నిర్వహించక తప్పదని, ఎన్నికలు జరపకుండా ఎల్లకాలం పారిపోలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు జమ్మూ కశ్మీరులో ఎన్నికలు నిర్వహించక తప్పదని, ఆరోజు ప్రజలు బిజెపి తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన జోస్యం చెప్పారు.
జమ్మూ కశ్మీరులో పాలన కోసం బయట నుంచి అధికారులను తీసుకువచ్చారని, మతం మాట పక్కనపెడితే వారికి అసలు స్థానిక భాష కూడా రాదని ఓమర్ అబ్దుల్లా ఎద్దేవా చేశారు. కశ్మీరులో ఒక్క ముస్లిం అధికారి కూడా లేరని, తాము చేసిన తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ విధంగా వ్యవహరించగలరా అని ఆయన ప్రశ్నించారు.