న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. నవంబరు 2 న ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరుకానున్నారు. అయితే ఆ సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆమ్‌ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈమేరకు ఢిల్లీ మంత్రి అతిషీ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ అరెస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు.
“ నవంబరు 2 న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందింది. ఒకవేళ ఆయన అరెస్టయితే అవినీతి ఆరోపణలపై మాత్రం కాదు… బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే …! ఢిలీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ రెండుసార్లు ఓడించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆప్ చేతిలో ఆ పార్టీ ఓటమి పాలైంది. కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు. ఎన్నికల్లో కేజీవాల్‌ను ఓడించలేమని బీజేపీకి అర్థమైంది. అందుకే ఇలా తప్పుడు కేసులు పెడుతోంది” అని అతిషీ ధ్వజమెత్తారు.
“ ఇప్పటికే ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్‌ను బీజేపీ అరెస్టు చేయించింది. ఇలా నేతలను జైలుకు పంపించి ఆప్‌ను సమూలంగా అడ్డు తొలగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత … ఇండియా కూటమి లోని ఇతర నేతలను కూడా బీజేపీ టార్గెట్ చేస్తుంది. విపక్షపార్టీలకు చెందిన సిఎంలపై సీబీఐ , ఈడీతో దాడులు చేయించే అవకాశాలు ఉన్నాయి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కేరళ సిఎం పినరయి విజయన్ వంటి వారు బీజేపీ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నారు” అని అతిషీ ఆరోపించారు.
అయితే ఇలాంటి దాడులకు ఆప్ నేతలు భయపడబోరని ఆమె అన్నారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా నవంబరు 2 న ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే అంతకు ముందు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ ఆయనను ఈ కేసులో కొన్ని గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.