Friday, December 20, 2024

చైనా, పాక్ సరిహద్దుల్లో ఎస్-400 మోహరింపు

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే మూడు రెజిమెంట్ల మోహరింపు పూర్తి
మరో రెండు రెజిమెంట్ల డెలివరీ కోసం రష్యాతో చర్చలకు భారత్ సిద్ధం

న్యూఢిల్లీ: భారత వాయుసేన మూడు ఎస్400 గగనతల రక్షణ వ్యవస్థ రెజిమెంట్లను చైనా, పాక్ సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. రష్యానుంచి అందాల్సిన మరో రెండు స్కాడ్రన్లపై మాస్కోతో చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని కూడా ఆ వార్తాసంస్థ కథనంలో వెల్లడించారు. భారత్ దాదాపు రూ.35 వేల కోట్లు వెచ్చించి ఈ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు 2018 19లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఐదు రెజిమెంట్లను మనదేశం అందుకోనుంది.

ఇప్పటికే మూడు రెజిమెంట్లు మన దేశానికి చేరుకున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా మిగతా రెండు రెజిమెంట్ల డెలివరీ ఆలస్యమయింది. భారత్‌కు చేరిన మూడు రెజిమెంట్లలో ఒకదానిని చైనాపాక్ సరిహద్దుల్లో నిఘా వేసి ఉంచేలా, మిగతా రెండింట్లో ఒక్కోదానిని పాక్, చైనా సరిహద్దుల్లోని కీలక సెక్టార్లలో వేర్వేరుగా మోహరించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపినట్లు ఆ ఆంగ్ల వార్తాసంస్థ తెలిపింది. మిగతా రెండు రెజిమెంట్లకు సంబంధించి డెలివరీలపై రష్యా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత అధికారులు సిద్ధమయ్యారు. నిజానికి ఈ రెండు రెజిమెంట్లను కచ్చితంగా ఎప్పుడు అందిస్తామో చెప్పలేని స్థితిలో రష్యా ఉంది.

ఇప్పటికే భారత్ కోసం తయారు చేసిన ఎస్400 రెజిమెంట్లను అది ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. తమకు రావలసిన వ్యవస్థలను ఎలా పొందాలనే దానిపైనే తాము దృష్టిపెడుతున్నామని ఆ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్, చైనాలనుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరితం బలోనేతం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కుశ కింద భారతీయ లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థను సమకూర్చుకోవడానికి భారత రక్షణ పరికరాల కొనుగోలు మండలి ఇటీవల ఆమోదం తెలిపింది.

భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. మరో వైపు ‘ఎల్ శామ్’ డెలివరీ షెడ్యూల్‌ను వేగవంతం చేసే విషయమై వైమానికదళం డిఆర్‌డిఓతో చర్చలు జరుపుతోంది. మూడంచెల లాంగ్ రేంజ్ భూతలంనుంచి గగన తల లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి వ్యవస్థ దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలు, క్షిపణులను కూడా ధ్వంసం చేయగలదు. మరో వైపు జమ్మూ, కశ్మీర్‌లోని వ్యూహత్మక శ్రీనగర్ ఎయిర్ బేస్ వద్ద గతంలో మిగ్21స్కాడ్రన్ విధులు నిర్వహించగా,తాజాగా వాటి స్థానంలో మిగ్ 29 యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News