న్యూఢిల్లీ: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధం చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 5,000 మంది పారిశుధ్య కార్మికులను క్రమబద్ధం చేయాలన్న ప్రతిపాదనకు మున్సిపల్ కౌన్సిల్ మంగళవారం ఆమోదం తెలిపింది. అదే విధంగా 3,100 మంది కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలన్న ప్రతిపదానను కూడా కౌన్సిల్ ఆమోదించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం వర్చువల్‌గా జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను బిజెపి పాలించిన కాలంలో పారిశుధ్య కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసిందని ఆయన ఆరోపించారు.
పంజాబ్‌లో కూడా తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టామని, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే 30,000 మంది తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధం చేసిందని ఆయన తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న ప్రతి రాష్ట్రంలో తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపడతామని ఆయన తెలిపారు.