న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలువురు విపక్ష నేతల ఐఫోన్లకు మంగళవారం హ్యాక్ అలర్ట్ మెసేజ్‌లు రావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తున్నారు ’ అంటూ ఆ సందేశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు భగ్గు మన్నాయి. ఈ నేపథ్యం లోనే ఈ హ్యాక్ అలర్ట్ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం తమ దర్యాప్తును వేగవంతం చేసింది.
దీనిపై వివరణ కోరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఐటీ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం , రాబోయే సమావేశంలో ఈ హ్యాక్ అలర్ట్ అంశంపై చర్చించనుందని ఈ కమిటీ సెక్రటేరియట్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసిందని, దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిందని తెలిపాయి. ఈ వ్యవహారంపై యాపిల్ ప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని కమిటీ యోచిస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.