తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీనుంచి ఎంఐఎం టికెట్ పై ఒక మహిళ బరిలోకి దిగనున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది, చట్టంగా మారిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాకపోయినా, భావి ఎన్నికల్లోనైనా మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ కావడం ఖాయం కాబట్టి, ఇప్పటినుండే పార్టీపైనా, రాజకీయాలపైనా పట్టు ఉన్న మహిళలకోసం ఆయా పార్టీలు జల్లెడ పడుతున్నాయి. ఈ రేసులో ఎంఐఎం ముందున్నట్లుగా తెలుస్తోంది.
ఒవైసీ సోదరులు ఇప్పటికే తమ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న మహిళలకోసం అన్వేషణ చేపట్టారు. వారిలో ఒకరిని ఎంపిక చేసి, ఈసారి చార్మినార్ నుంచి గానీ, లేదా మరో నియోజకవర్గంనుంచి గానీ బరిలోకి దించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చార్మినార్ నుంచే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని ఒవైసీ సోదరులు భావిస్తున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. ఒకవేళ, భవిష్యత్తులో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మహిళలకు కేటాయించిన పక్షంలో, ఇప్పుడు ఎంఐఎం టికెట్ పై అసెంబ్లీకి పోటీ గెలిచే అభ్యర్థినే, పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంనుంచి బరిలోకి దించవచ్చన్నది ఒవైసీ సోదరుల ఆలోచన. ఇప్పటికే ఒక మహిళా నాయకురాలిని ఎంపిక చేశారనీ, త్వరలోనే ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని విశ్వసనీయ వర్గాల కథనం.