Monday, December 23, 2024

ఎన్నికల నిర్వహణకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

17 జిల్లాల్లో 166 సరిహద్దు చెక్‌పోస్టులు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
పోలింగ్ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేయండి : ఇసి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్దంగా ఉందని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఈ నెల 30న రాష్ట్రంతో పాటు దేశంలోని మరో 4 రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు వాటి సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎసి పాండే, అరుణ్ గోయెల్‌లు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీ కుమార్‌లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శాసన సభ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దంగా ఉందని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ప్రధాన ఎన్నికల అధికారికి శాంతికుమారి వివరించారు.
పోలింగ్‌కు ముందే సరిహద్దులు మూసివేయండి : రాజీవ్‌కుమార్
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఏర్పాట్లపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేయాలని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆయన ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ సరిహధ్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్ పోస్ట్ లను కట్టు దిట్టం చేశామని శాంతికుమారి వివరించారు. రాష్ట్రంలో నిఘా పెంచడం జరిగిందని దీని ఫలితంగా రూ. 385 కోట్ల మేర నగదు జప్తు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 17 సరిహద్దు జిల్లాల్లో 166 సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాలు 154 సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయని ఆమె తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలతో సమర్థవంతమైన సమన్వయం కోసం డిజిపి కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

నవంబర్ 28వ తేదీ నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డిజిపి అంజనీకుమార్ ఎన్నికల అధికారులకు తెలిపారు. ఇప్పటి వరకు 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిటి అండ్ ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, సిఇఒ వికాస్‌రాజ్, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, అదనపు డిజి మహేష్ భగవత్, జిఎడి సెక్రటరీ శేషాద్రి, సిఆర్‌పిఎఫ్ ఐజి చారు సిన్హా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News