తెలంగాణలో ఆపార్టీకి బలం లేదని నేతల ఆగ్రహం
మన తెలంగాణ/ హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేన పొత్తు, సీట్ల వ్యవహారంలో చర్చలు జరుగుతున్న సమయంలో బిజెపిలో టికెట్ల పంపిణీపై పలువురు ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలు జనసేనకు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో ఇన్నాళ్లు ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్న నేతలు రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. గురువారం నాగర్ కర్నూల్ టికెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఆ నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జ్ దిలీప్ చారి అనుచరులతో కలిసి శ్యామ్ ముఖర్జీ భవన్ వద్ద ఆందోళనకు చేశారు. ‘జనసేన వద్దు, బిజెపిముద్దు’ అని నినాదాలు చేశారు. జనసేన అసలు తెలంగాణలో లేదని, అలాంటప్పుడు టికెట్ ఎలా ఇస్తారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడో జాబితా ప్రకటించడంతో బిజెపి కార్యాలయం నిరసనలతో గందరగోళంగా మారింది.