మణిపూర్ రచయిత్రి కుర్ ఫినా కిమ్ కోవా ఆవేదన
మన తెలంగాణ/హైదరాబాద్ : మణిపూర్ పరిస్థితులు ఇప్పటికీ అధ్వాన్నంగా ఉన్నాయని, కనీసం మృతదేహాలకు కూడా దహన సంస్కారాలు చేసే పరిస్థితి లేదని మణిపూర్ రచయిత్రి కుర్ ఫినా కిమ్ కోవా ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు,ఆరు నెలలుగా 107 మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని, వాటిని తీసుకెళ్లే పరిస్థితులు కూడా లేవన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ‘రాజకీయ, విద్యా, శాస్త్రీయ’ అంశాలపై మూడ్రోజుల ‘శిక్షణ తరగతులు’ హైదరాబాద్ మగ్దూం భవన్ గురువారం ప్రారంభమయ్యాయి.
ఈ సమావేశానికి ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.సదాలక్ష్మి సభాధ్యక్షత వహించగా, ప్రారంభ సూచికగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ పతాకాన్ని ఆవిష్కరించగా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఉస్తెల సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.ఛాయాదేవి, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి కరుణకుమారి, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫైమీద , లక్ష్మి, జంగమ్మతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్బంగా కుర్ ఫినా కిమ్ కోవా మాట్లాడుతూ మణిపూర్ అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నించలేదని విమర్శించారు. మహిళలంతా ఐక్యంగా నిలబడితే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. మణిపూర్ ఘటనలో తమకు సంపూర్ణ మద్దతుగా నిలిచిన భారత మహిళా సమాఖ్యకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
అదానీకి ఖనీజ సంపద దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం : అనీరాజా
మణిపూర్ ఖనిజ సంపదను అదానీకి దోచిపెట్టేందుకే కేంద్రం,మణిపూర్ బిజెపి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని అనీ రాజా విమర్శించా రు.మణిపూర్ అల్లర్లు పూర్తిగా సద్దుమణిగి, వారికి న్యాయం జరిగే వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీనిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి శక్తుల సవాలును తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసి, వారికి మద్దతుగా నిలువడమే మోడీ ప్రభుత్వ లక్ష్యమని దుయ్య బట్టారు. అత్యాచారానికి పాల్పడిన కేసులో శిక్షణ పడిన నిందితులకు ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం క్షమాబిక్షణ పెట్టడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. అత్యాచారం చేసి బయటికి వచ్చిన వారిని బిజెపి శక్తులు ఘనంగా స్వాగతం పలకడం… అత్యాచారాలు జరిగితే తప్పు కాదా?, ఊరిశిక్షను అమలు చేస్తే మాత్రం తప్పా? అని నిలదీశారు. అనేక పోరాటల ద్వారా సాధించుకున్న చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ చట్టాలకు కనీసం విలువ కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. మహిళా సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉద్యమించాలని అనీరాజా పిలుపునిచ్చారు.