Monday, December 23, 2024

పాలస్తీనా విముక్తే శాంతికి మార్గం!

- Advertisement -
- Advertisement -

ఆసియా, ఐరోపా, ఆఫ్రికా మూడు ఖండాలకు ముఖ ద్వారంగా వ్యూహాత్మక ప్రాంతాన వున్నది పాలస్తీనా! యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల జన్మస్థానం! మోజెస్ జీసస్ ముహమ్మద్ ప్రవక్తలను ‘టాల్ముజ్ బైబిల్ ఖురాన్ మత గ్రంథాలను అందించిన పుణ్యభూమి పాలస్తీనా! యూదుల ‘సినగాగ్’ క్రైస్తవుల ‘హోలీ సెపల్ చెరా’ ఇస్లామీయుల ‘అల్‌అక్సా’ ఆలయాలున్న జెరూసలేం పాలస్తీనాలోదే! అందుకే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఖ్యాతి కెక్కింది జెరూసలేం. ప్రస్తుతం యూదు దేవాలయం తాలూకు ఒక్క గోడ మాత్రమే వుందక్కడ. అయినా సరే, ఏడాదికొకసారి యూదులంతా అక్కడ చేరి తమ దేవాలయ పతనానికి దుఃఖిస్తూ ఆ గోడనే ప్రార్థిస్తుంటారు. అందుకే ఆ గోడ విలాప కుడ్యంగా ఖ్యాతి కెక్కింది. పాలస్తీనాతో సహా పశ్చిమాసియాలోని 14 దేశాలూ అరబ్బు దేశాలే! ప్రపంచ ముడి చమురు, గ్యాస్ నిల్వలలో దాదాపు సగ భాగం ఈ దేశాల్లోనే లభిస్తుంది. వ్యవసాయ భూములు తక్కువగా వున్న ఆ దేశాల ప్రజలు చమురు నిక్షేపాలను తమ పాలిట వరంగా భావించారు. కాని అమెరికా సామ్రాజ్యం ఆయిల్ దోపిడీ కోసం చేస్తున్న

దుండగాల కారణంగా అవే తమ పాలిట శాపంగా మారాయంటూ అరబ్బులు నేడు వాపోతున్నారు! తొండ ముదిరి ఊసర వెల్లిగా మారినట్లు పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్యవాద దేశాలుగా మారతయ్! వాటి దోపిడీ విధానం ఎలా వుంటుందంటే? ఉ॥ ఒక దేశంలోని పెట్టుబడిదారులు తమ లాభాలకు తోడ్పడే ప్రభుత్వాన్ని బలపరుచుకొని, దాని సహకారంతో దేశంలోని వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చవకగా కొల్లగొట్టి ప్రపంచ కుబేరులుగా ఎదుగుతారు! నాడు కాంగ్రెస్, నేడు బిజెపి ప్రభుత్వాల అండతో ప్రపంచ కుబేరులైన అదానీ, అంబానీలే అందుకు నిదర్శనం! అలాగే సామ్రాజ్యవాద దేశాలు కూడా వర్ధమాన దేశాలలో తమ కనుకూల ప్రభుత్వాలను బలపరుచుకొంటూ కారుచవకగా ఆ దేశాల వనరులను కొల్లగొడుగూ తమ ఉత్పత్తులకు లాభసాటి మార్కెట్లుగా వాటిని మలుచుకొంటూ ప్రపంచ అగ్ర రాజ్యాలుగా ఎదుగుతయ్. ఈ క్రమంలో వాటి మధ్య పోటీ ఫలితాలే తొలి, మలి, ప్రపంచ యుద్ధాలు!

నేడు అమెరికా ఆయుధ, ఆయిల్ వ్యాపారులు, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి యూదు వ్యాపార దిగ్గజాలు అమెరికా ప్రభుత్వాన్నే శాసిస్తున్నారు. అందుకే ‘రిపబ్లికన్ ట్రంప్ అయినా’, డెమొక్రాట్ బైడెన్ అయినా’ వాళ్ళ లాభాల కోసమే శ్రమిస్తుంటారన్నది జగమెరిగిన సత్యం! తమదేశపు ఆయిల్ వ్యాపారుల లాభాల కోసమే అరబ్ దేశాల్లో తమకు లొంగి వుండే రాజులు, నియంతల ప్రభుత్వాలనే బలపరుస్తుంటుంది అమెరికా. తమను ధిక్కరిస్తాయనే ఆ దేశాల్లో ప్రజా ప్రభుత్వా లేర్పడకుండా జాగ్రత్త పడుతుంటుంది అమెరికా! వాళ్ళలోనూ తమకెదురు తిరిగిన ప్రభుత్వాలన్ని కూల్చడానికైనా, సదరు నేతను చంపడానికైనా వెనుకాడదు అమెరికా అని చరిత్ర చెబుతున్నది! ఉదా॥

తమను ధిక్కరించిన ‘లిబియా గడాఫీ, ఇరాక్ సద్దాం హుస్సేన్ వగైరాలను దారుణంగా చంపిన అమెరికా క్రూరత్వం ప్రపంచానికెరుకే! అపార చమురు నిల్వలున్న అరబ్బు దేశాల మధ్య తమ కనుకూలమైన అరబ్బేతర ప్రభుత్వాన్ని ఏర్పరచాలన్న కుయుక్తి తోనే పాలస్తీనాలో ‘ఇజ్రాయెల్ మొక్కను’ నాటింది బ్రిటన్! దాన్ని మహా వృక్షంగా పెంచుతున్నది అమెరికా. నేటికీ ఇజ్రాయెల్‌కు ఏడాదికి 300 కోట్ల డాలర్లను అమెరికా అందిస్తుండడమే అందుకు నిదర్శనం! ఈ నేపథ్యంలోనే యూదుల తొల్లిటి దేశం పాలస్తీనాయేనంటూ అంతర్జాతీయ మీడియా డప్పు గొడుతున్నది! దాన్ని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే, భారత జాతీయ మీడియా ‘మోడీయా’ గా మారినట్లే, అంతర్జాతీయ మీడియా ‘అమెరికీయా’గా మారింది! వాస్తవమేమంటే?

క్రీ.పూ. 1500 సం॥ క్రితం ఈజిప్టులో బానిసలుగా పీడింపబడుతున్న వందలాది యూదులను రహస్యంగా ఎర్ర సముద్రం దాటించి, బానిస వ్యవస్థ లేని పాలస్తీనాకు చేర్పించాడు మోజెస్ అని బైబిలు పాత నిబంధన చెబుతున్నది! నాటి నుండి పాలస్తీనీయులతో మమేకమై జీవించారు యూదులు! క్రీస్తు పుట్టాక ఆయన బోధలకు ప్రభావితులై పలువురు క్రైస్తవులుగా మారారు. తమను వ్యతిరేకిస్తున్న యూదుల అణచివేతకు పూనుకొన్నారు రోమన్ చక్రవర్తులు. తాళలేక ఐరోపా దేశాలకు పారిపోయారు యూదులు! అనంతరం టర్కీ సామ్రాజ్యధిపతులు క్రైస్తవుల అణచివేతకు పూనుకొన్నారు. దాన్తో వాళ్ళూ పారిపోయారు. నాటి నుండి పాలస్తీనాలో మిగిలి వున్న మెజారిటీ అరబ్బులు, వందల సంఖ్యలో యూదులు, క్రైస్తవులూ కలిసి మెలిసి జీవిస్తున్నారు. అయితే పాలస్తీనా ప్రజలు టర్కీ సామ్రాజ్యంలో భాగంగా కొంత కాలం, తర్వాత బ్రిటన్ పాలనలో మగ్గుతూనే వున్నారు.

అయితే ఆయా దేశాల్లో స్థిరపడిన యూదులు మాత్రం సహజసిద్ధమైన తెలివి, చరుకుదనం, శ్రమించేతత్వంతో విద్యావంతులు, మేధావులు, వ్యాపారులు, బ్యాంకర్లు, ఉన్నతోద్యోగులుగా ఎదిగారు! ఐరోపా దేశాల సాంప్రదాయక క్రైస్తవులు ‘సకల అనర్థాలకు మూలం ధనమే’నన్న విశ్వాసంతో, ఆధ్యాత్మికతకే ప్రాధాన్యమిచ్చారు. తత్కారణంగానే వాళ్ళందుకో లేనంత ఎత్తుకెదిగారు యూదులు! దానితో స్థానిక ఐరోపా ప్రజల్లో, యూదుల పట్ల అసూయ, క్రీస్తును శిలువ వేయించింది వాళ్ళే గనుక వారి పట్ల ద్వేషమూ ప్రబలింది! దేశ దేశాలలో యూదులపై దాడులు ప్రబలినయ్. హిట్లరు జర్మనీలో అవి తారస్థాయికి చేరినయ్! ఈ నేపథ్యంలో ఒక యూదు రచయిత, యూదుల అగచాట్లను వివరిస్తూ రాసిన గ్రంథంలో తొల్లిటి పాలస్తీనాకు తరలిపోవడమే యూదులకు శ్రేయస్కరమని సూచించాడు! నాటి నుండి పాలస్తీనాకు క్యూ కట్టారు యూదులు! క్రమంగా వందలు, వేలు, లక్షల సంఖ్యలో పాలస్తీనాకు చేరుకొన్నారు యూదులు.

తమ వెంట తెచ్చుకొన్న ధర రాసులతో వస్తూనే పేద అరబ్బు రైతుల భూములను కారు చవకగా కొనేశారు. ఎదురు తిరిగిన అరబ్బుల అణచివేతకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పరచుకొన్నారు. యూదుల నేతగా ఎదిగిన ‘బెన్‌గురియన్’ ‘ఆపరేషన్ మ్యాజిక్ కార్పెట్’ (మాయా తివాచీ పథకం) ద్వారా ఏ దేశం నుండి వస్తున్న యూదు కుటుంబాలకై రవాణా సదుపాయాలను కల్పించి పాలస్తీనాలో యూదుల సంఖ్యను భారీగా పెంచాడు. అందుకే ‘రెండవ మోజెస్’ గా యూదుల చేత ఆరాధింపబడుతున్నాడు బెన్ గురియన్! ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రూరంగా హింసింపబడి లక్షల సంఖ్యలో హతమార్చబడిన వారు యూదులే! తమ గతాన్ని విస్మరించి అంతకంటే దారుణ మారణకాండకు తెగబడి రెట్టింపు సంఖ్యలో పాలస్తీనా అరబ్బులను బలి కొంటున్నదీ యూదులే కావడం దురదృష్టం! కారల్ మార్క్, ఐన్‌స్టీన్,

సిగ్మండ ఫ్రాయిడ్, ట్రీట్‌స్కీ, స్టీవెన్ స్పీల్‌బర్గ్, నీల్స్‌బోర్, ఎపన్ హైమర్, మెండల్, స్పినోజా మొ॥ యూదు మేధావులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తల వారసులైన యూదులు అమెరికా అండదండలు చూసుకొని హిట్లరును మించిన జాత్యహంకారులుగా అగ్ర రాజ్యాలకు పావులుగా వ్యవహరించడం శోచనీయం! ఐరాస ఆంక్షలు, నిబంధనలు, తీర్మానాలు, ఇజ్రాయెల్‌కు నిర్ణయించిన హద్దుల్ని కూడా అతిక్రమించి ఐరాస పరిధిలోని జెరూసలేంతో సహా 78% పాలస్తీనాను దురాక్రమించింది. అందుకే 1990లో ఇజ్రాయెల్‌ను ‘టెర్రరిస్టు స్టేట్’ గా నిరసించింది ఐరాస. అయినా సరే లక్షలాది అరబ్బులను చంపి, పారద్రోలి మిగిలిన సగం మంది పాలస్తీనీయులను గాజా, వెస్ట్‌బ్యాంక్ పట్టణాలలో కుక్కి, వాళ్ళు బయటకు రాకుండా ఇజ్రాయెల్ కడ్డంగా వందల కోట్ల డాలర్లతో, ‘ఐరన్ డోమ్’ అను స్మార్ట్ గోడను నిర్మించుకున్నది ఇజ్రాయెల్! ఆ రెండు పట్టణాలలో కరెంటు, నీళ్లు, పంటలు, ఫ్యాక్టరీలు, తిండి, మందులు లేవు. ప్రపంచం అందిస్తున్న సహాయంతో బతకడానికి తింటూ, చావలేక బతుకుతున్నారు అరబ్బులు!
ఆసర్ ఆరాఫత్ లాంటి నేతల ధర్మపోరాటం వృథా

కావడంతో సాయుధ గెరిల్లా పోరాట దళంగా రూపొందింది హమాస్! 6 వేల మంది అరబ్బు పోరాట యోధులను బందీలుగా చెరసాళ్లలో కుక్కి క్రూరంగా హింసిస్తున్నది ఇజ్రాయెల్. ఆ నరకం నుండి వాళ్ళకు విముక్తి కలిగించే పథకమే 7 అక్టోబర్ 23 నాటి ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి! తద్వారా 200 మంది సైనిక, పోలీసు, ఉన్నతోద్యోగ వర్గాల ఇజ్రాలీయులను కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్ళారు! ప్రతిగా గాజాపై మంటల వర్షం కురిపించి ఎంతో మంది స్త్రీ, బాల, వృద్ధులను, రోగులను అమానవీయంగా మాడ్చేసింది ఇజ్రాయెల్! అరబ్బుల ఇంటికి ఆశ్రయం కోరి వచ్చిన యూదులు ఆ ఇంట్లో వుంటూనే పక్కనే సొంత ఇంటిని కట్టుకొన్నారు! దానితో సంతృప్తి పడక ఆశ్రయమిచ్చిన అరబ్బుల ఇంటిని కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళను వీధుల పాల్జేసిన ఇజ్రాయెల్‌ది ఆత్మరక్షణ పోరాటమనీ, తమ సొంత ఇంటి కోసం పోరాడుతున్న హమాస్‌ది ఉగ్రవాదుల దాడి అని అమెరికా అరస్తుంటే, మోడీతో సహా పలువురు భారతీయులు కూడా అమెరికాకు వంత పాడడం భారత దేశపు గౌరవానికి భంగకరం!
ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తివంతమైన రక్షణ వలయాలను,

సమర్థవంతమైన నిఘా వ్యవస్థలను కలిగియున్న అమెరికా, ఇజ్రాయెల్ విస్మరిస్తున్న వాస్తవం ఏమంటే? “మెజారిటీ మతతత్వం, మైనారిటీ మతోన్మాదానికి, మెజారిటీ జాతితత్వం, మైనారిటీ జాతీయ ఉద్యమానికి బీజం వేస్తయ్!” అన్నారు నెహ్రూ! “నిరంతర అణచివేత బాధితుల్లో చావు తెగింపుకి బీజం వేస్తుంది! రోజూ చస్తూ బతకడం కన్నా, బతకడం కోసం చద్దామన్న తెగింపు బాధిత హృదయాల్లో జ్వలిస్తే తద్వారాజరిగే దారుణాలను ఊహించలేము, నిరోధించలేము!’ అన్నారు కెన్నడీ! ఉదా॥ నాటి అమెరికా వాణిజ్య భవనాల (ట్విన్ టవర్స్) పై ‘ఆల్‌ఖైదా దాడి’!నేటి ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి అందుకు నిదర్శనాలు! అంతటి పటిష్ట రక్షణ వలయాలు, నిఘా వ్యవస్థలు కూడా వాటిని ఆపలేకపోయాయి గదా! అందుకే ప్రపంచాధి నేతల్లారా! ఇకనైనా ఇజ్రాయెల్ అణచివేతను ఆపించండి! ‘పాలస్తీనా దేశాన్ని ఆవిష్కరించి ప్రపంచ శాంతిని కాపాడండి! ఇది మనందరి సమిష్టి బాధ్యత! ఎందుకంటే కాలు గోరు విరిగినా, పంటికి నొప్పి కలిగినా అది దేహానికంతటికీ బాధాకరమే! అందుకే ఏ అవయవానికి దెబ్బ తగిలినా

దాని గాయం మానేదాక దేహంలోని కణజాలమంతా సమిష్టిగా కృషి చేస్తుంటుంది! అలాగే మణిపూర్ మండుతున్నా , పాలస్తీనా ఆక్రోషిస్తున్నా అది దేశానికి, ప్రపంచానికంతటికీ బాధాకరమే! అందుకే ప్రపంచంలో ఏ దేశానికి విపత్తు సంభవించినా దాన్నుండి ఆ దేశాన్ని గట్టెకించే దాకా ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేస్తుండాలి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ప్రకృతి, చరిత్ర మానవాళికి నిర్దేశిస్తున్న ఏకైక మార్గమిదే! ఇదే! ఇదే తస్మాత్ జాగ్రత్త!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News