వారణాసి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బనారస్ హిందూ యూనివర్సిటీ(ఐఐటి-బిహెచ్‌యు)కు చెందిన ఒక విద్యార్థినిని బలవంతంగా ముద్దు పెట్టుకున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను వివస్త్రను చేసి వీడియోను షూట్ చేశారు. యూనివర్సిటీ క్యాంపస్ లోపల బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన విద్యార్థులు గురువారం తరగతులను బహిష్కరించి వీధుల్లోకి వచ్చి నిరసన తెలియచేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుంగడులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు.
బుధవారం రాత్రి ఆ విద్యార్థిని క్యాంపస్‌లో నడుస్తుండగా ఈ ఘటన జరిగింది. తాను, మరో విద్యార్థిని కలసి క్యాంపస్‌లోని కర్మన్ వీర్ బాబా ఆలయం వద్ద నడుచుకుని వెళుతుండగా బుల్లెట్ బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు తమను అడ్డగించారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తనను బలవంతంగా ఒక మూలకు లాక్కెళ్లిన ఆ యువకులు ముద్దుపెట్టుకుని వివస్త్రను చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోటోలను, వీడియోను తీశారని, తాను గట్టిగా కేకలు వేయగా చంపేస్తామంటూ నిందితులు బెదిరించారని ఆమె తెలిపింది. దాదాపు 10-15 నిమిషాలపాటు తనను నిర్బంధించారని ఆమె తెలిపింది. తన ఫోన్ నంబర్‌ను కూడా వాళ్లు తీసుకున్నట్లు ఆమె చెప్పింది.
ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన రిజిస్ట్రార్ యూనివర్సిటీ ప్రధాన ద్వారాన్ని రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. గుర్తు తెలియని యువకులు ముగ్గురి పైన పోలీసులు ఐపిసిలోని సెక్షన్ 354(బి), ఐటి చట్టంలోని , 66 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సిసిటివి ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.