సంగారెడ్డి: తెలంగాణ అభివృద్ధిని నిరంతరం కాక్షించే సిఎం కెసిఆర్‌ను ఏం చేయలేక తెలంగాణ దోహ్రులంతా ఒక్కటవుతున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌ని క్రిమినల్ అనడం విడ్డూరంగా ఉందని హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డి చౌరస్తాలో బిఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి మాట్లాడుతూ తెలంగాణాకు కెసిఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ కావాలె కానీ, రాంగ్ లీడర్లు అవసరం లేదని అన్నారు. ఎన్నికలు వచ్చే సరికి తెలంగాణా ద్రోహులంతా ఒక్కటయ్యారని విమర్శించారు. తెలంగాణా ఏర్పడినప్పుడు ఒక రోజంతా తాను భోజనం చేయలేదని చెప్పిన పవన్ కళ్యాణ్‌తో బిజెపి జత కడుతోందని, తెలంగాణను సిగరెట్‌తో బీడీతో పోల్చిన వైఎస్ కుమార్తె షర్మిలతో కలిసి పని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధ్దమయిందని ఆరోపించారు.
ఈ విధంగా రెండు జాతీయ పార్టీలు తెలంగాణా ద్రోహులతో జట్టుకడుతున్నాయని, వీరికి బుద్ధ్ది చెప్పాల్సిన అవసరముందన్నారు. నాడు రేవంత్ రెడ్డి ఉద్యమకారుల మీదికి తుపాకీ పట్టుకుని రాలేదా? అని ప్రశ్నించారు. మనం గట్టిగా పని చేస్తే, జగ్గారెడ్డి గాలిలో కొట్టుకుపోతాడని అన్నారు. గత ఎన్నికల్లో జగ్గారెడ్డి గల్లీకో ఎటిఎం పెడతానని, ఓడిపోతే తనను జైలులో పెడతారంటూ ఏడ్చాడని గుర్తు చేశారు. మనిషికో కార్డు అన్నడు..కార్డులు లేవు ఎటిఎం లేదని అన్నారు. కరోనా కష్ట కాలంలో పత్తా లేడని, ఓడినప్పటికీ చింత ప్రభాకర్ ప్రజల్లోనే ఉన్నాడన్నారు. నాడు సంగారెడ్డిని బీదర్‌లో కలపాలని అన్నాడని, తెలంగాణకు వ్యతిరేకంగా పని చేశాడన్నారు. దశాబ్దాల తెలంగాణా కలను సాకారం చేసిన కెసిఆర్‌తో ఇలాంటి నేతలా పోటీ పడేది అని అడిగారు. తెలంగాణా గెలవాలంటే కారు గుర్తుకు ఓటేయాలని, తెలంగాణా ఓడాలంటే రేవంత్ క్రిమినల్ గ్యాంగ్‌కు ఓటేయాలని అన్నారు. ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో ఖైదీ నెంబర్ 1779 అని, బైయిల్ మీద ఉన్నారని గుర్తు చేశారు.
రేవంత్‌రెడ్డి దోస్తానా అంతా కూడా తెలంగాణా ద్రోహుల తోనని అయనన్నారు. చంద్ర బాబు పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని చెప్పి, వీరికి సపోర్టు చేస్తదంట అని ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా, సుభిక్షంగా ఉన్న తెలంగాణాను ఆగం చేసేందుకు వీరంతా ఒక్కటవుతున్నారని విమర్శించారు. పోయిన సంగారెడ్డిలో కాంగ్రెస్‌తో బిజెపి జత కట్టిందని, ఈసారి కూడా ఆ ప్రమాదం లేకపోలేదని అన్నారు. ఈ సారి సంగారెడ్డిలో చింత ప్రభాకర్‌ను గెలిపిస్తే సంగారెడ్డి వాసులకు పది వేల మందికి ఇంటి స్థలాలిస్తామని హామీ ఇచ్చారు. ఇన్‌చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ చింత ప్రభాకర్‌ను గెలిపించి సిఎం కేసీఆర్‌కు గిఫ్టుగా ఇవ్వాలని అన్నారు. ఉద్యమ ద్రోహులను తరిమి కొట్టాలని అన్నారు. అభ్యర్థి చింత ప్రభాకర్ మాట్లాడుతూ తన ప్రాణమున్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. పార్టీ నేతలు మాణిక్యం, టిఎన్‌జిఓ మాజీ నేత రాజేందర్,శివరాజ్ పాటిల్, ముఖీం,జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నరహరిరెడ్డి, సిడిసి ఛైర్మన్ కాసాల బచ్చిరెడ్డి,మున్సిపల్ ఛైర్మన్ విజయలక్ష్మి,సునితా మనోహర్‌గౌడ్,కొండల్‌రెడ్డి,విజేందర్‌రెడ్డి,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.