నంగునూరు: బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నేడు సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయానికి రానున్నారు. సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయం అయిన కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు చేరుకొని స్వామివారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ ఆలయం సిఎం కెసిఆర్‌కు సెంటిమెంట్ కావడంతో ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను సిఎం కెసిఆర్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. సిఎం కేసిఆర్ తన రాజకీయ జీవితం మొదలుకొని ప్రతి ఎన్నికల్లో కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజల అనంతరం నామినేషన్ వేసి ఎన్నికల బరిలోకి దిగుతారు సిఎం కెసిఆర్.
అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఉద్యమాన్ని ఇక్కడి ఆలయంలో పూజలు చేసిన అనంతరమే కెసిఆర్ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. అప్పటి నుంచి మొదలుకొని ప్రతి ఎన్నికల్లో ఈ కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తన నామినేషన్ దాఖలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగనున్న సిఎం కెసిఆర్ నేడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కొనాయిపల్లి వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అగ్రనాయకులైన కెసిఆర్, హరీశ్‌రావులకు అచ్చొచ్చిన వేంకటేశ్వరాలయాన్ని యాబై సంవత్సరాల కిందట నంగునూరు మండలం కొనాయిపల్లిలో నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గోదావరి జలాలతో కొనాయిపల్లి వెంకన్న పాదాలను కడిగి సిద్దిపేట నియోజకవర్గానికి సాగునీళ్లు- తెస్తానని ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ హామీ ఇచ్చారు. సెంటిమెంట్, వాస్తుపై నమ్మకమున్న కేసిఆర్ సూచనల మేరకు కొనాయిపల్లి ఆలయాన్ని విస్తరించాలని నిశ్చయించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి సరిపడా నిధులను సమకూర్చి ఆలయాన్ని పునర్నిర్మించారు.
కెసిఆర్ కు సెంటిమెంట్ గా మారింది ఇలా…!
కోనాయిపల్లిలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎంతో మహిమ ఉందని ప్రచారం జరగడంతో భక్తులు ఆలయానికి వచ్చి మోక్కులు తీర్చుకునేవారు. ఆలయ గొప్పతనం గురించి తెలుసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసిఆర్) 1985లో- జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పూజలు చేసి తన రాజకీయ గురువు మదన్ మోహన్ పై గెలుపొందడంతో కోనాయిపల్లి ఆలయం ఆయనకు సెంటిమెంట్- మారింది. అప్పటి నుంచి 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీకి ముందు ఆలయంలో పూజలు చేసిన తరువాత నామినేషన్ వేసేవారు. అలాగే ఏకొత్త పని ప్రారంబించినా ముందుగా ఇక్కడ పూజలు చేయడం కేసీఆర్ కు ఆనవాయితీగా మారింది.
వెంకన్న ఆశీస్సులతో పార్టీ ఏర్పాటు
డిప్యూటీ స్పీకర్ ఉన్న కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించేందుకు 2001లో తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హైదరాబాద్ లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొనాయిపల్లి ఆలయం అందరి దృష్టిలో పడింది. నాటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు బిఆర్‌ఎస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచి ప్రారంభించడం సెంటిమెంట్‌గా మారింది. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో గ్రామస్తులు ఆలయంలో పూజలు చేసి స్వామివారి ప్రసాదం, కంకణం తీసుకెళ్లి- కెసిఆర్కు ఇవ్వడంతో ఆయన బతికారని గ్రామస్తుల నమ్మకం.
హరీశ్‌రావుకు అచ్చొచ్చిన ఆలయం
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖమంత్రిగా ఉన్న హరీశ్‌రావు 2006లో జరిగిన ఉప- ఎన్నికల్లో ఆలయంలో పూజలు చేసి మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు సెంటిమెంట్ ఆలయంగా మారింది. అప్పటి నుంచి 2009, 2014, 2018లో ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఇక్కడ పూజలు చేసి నామినేషన్ స్పె సంతకం చేసి నామినేషన్ వేసేవారు. ఇప్పటి వరకు ఐదుసార్లు పోటీ చేయగా తన మెజార్జీని తానే బ్రేక్ చేస్తూ ఘన విజయాలు సాదిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత. మంత్రి. ‘పదవి చేపట్టాగానే ముందుగా కొనాయిపల్లి వెంకన్నను దర్శించుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం హరీష్ రావుకు సెంటిమెంట్‌గా మారింది.
ఆలయ నిర్మాణం…..
ఐదు దశాబ్దాల కిందట కొనాయిపల్లిలోగూడెం ఎల్లారెడ్డి అనే రైతు అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చెట్టమందును పంపిణీ చేయడంతో వ్యాధులు నయమై భక్తు తాకిడి పెరిగింది. ఈ క్రమంలో తనకు వేంకటేశ్వరస్వామి కలలో కనబడి గ్రామంలో గుడి కట్టించాలని చెప్పాడని గ్రామస్తులకు తెలిపాడు. పసరు మందు తాగేందుకు వచ్చిన భక్తులు ఇచ్చే కానుకలతో పాటు గ్రామస్తులు తన వంతుగా ఆర్థిక సహాయం చేయడంతో 1975లో కొనాయిపల్లిలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్వామివారి విగ్రహాన్ని అన్ని ఆలయాలకు భిన్నంగా దక్షిణ ముకుడుగా ఏర్పాటు చేశారు. విగ్రహానికి ఎదురుగా ఆంజనేయుడి విగ్రహం, ధ్వజస్థంభాన్ని ఏర్పాటు చేసి ఉత్తర ద్వారాన్ని నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ప్రతియేటా గ్రామస్తుల సహకారంతో స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు.