Monday, December 23, 2024

అవినీతి అంతానికి పౌర ప్రతిజ్ఞ

- Advertisement -
- Advertisement -

ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) 30 అక్టోబర్ నుండి 5 నవంబర్ దాకా ఏడు రోజుల పాటు జాగరూకత అవగాహనా వారం (విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్) నిర్వహించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు, విభాగాలకు, బ్యాంకులకు ఆదేశాలు పంపింది. దీనిలో భాగంగా కేంద్ర ఉద్యోగులందరూ అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలనీ కోరింది. లంచం ఇవ్వము, తీసుకోము అనే రీతిలో ఈ ప్రతిజ్ఞ ఉంటుంది. పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి పార్లమెంట్ భవనంలోని కార్యదర్శులు, అధికారులతో అక్టోబర్ 30న ఉదయం పదకొండు గంటలకు ఈ ప్రతిజ్ఞ చేయించారు. అదే బాటలో వివిధ శాఖల కార్యదర్శులు తమ సిబ్బందితో ఈ ప్రతిజ్ఞ చేయిస్తారు. కేంద్రం నిర్వహణలో ఉండే దేశంలోని అన్ని కార్యాలయాల్లో ఈ అవగాహనా వారాన్ని పాటించాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో, విధి విధానాలతో సివిసి ఉత్తర్వులను జారీ చేస్తుంది.

దీని నిర్వహణలో భాగంగా ఈ మధ్య బ్యాంకులు, ఎల్ ఐసి ఆఫ్ ఇండియా, మ్యూచువల్ ఫండ్ నిర్వహించే సిఎఎంఎస్ తదితర సంస్థలు తమ కస్టమర్లను ఆన్‌లైన్ ఆధారంగా ప్రతిజ్ఞలో పాల్గొనమని విజ్ఞప్తి చేస్తున్నాయి. దేశాభివృద్ధికై అవినీతి రహిత ఇండియా నిర్మాణం కోసం విజిలెన్స్ వీక్ సందర్భంగా ప్రతిజ్ఞ చేపట్టేందుకు ఇవి సివిసి వెబ్‌సైట్ లింక్‌ని మెసేజ్ చేస్తున్నాయి. ఆ లింక్ ద్వారా మొబైల్‌లోనూ ప్రతిజ్ఞలో పాల్గొనవచ్చు. గూగుల్ సెర్చ్‌లో ప్లెడ్జ్ సివిసి అని వెదికినా ఇంటెగ్రిటీ ప్లెడ్జ్ ఓపెన్ అవుతుంది. పౌరుడికి, సంస్థలకు విడిగా ఉంది. మూడు తేలికైన స్టెప్స్‌తో దీనిని పూర్తి చేయవచ్చు. పౌరుడుని ఎంపిక చేస్తుకున్నాక పేరు, పాన్ కార్డు నెంబరు, జన్మ తేది, పిన్ కోడ్, జిల్లా, రాష్ట్రం లాంటి వివరాలు అందులో నమోదు చేయాలి. దేశంలోని ప్రభుత్వ విభాగాల్లో లంచగొండితనాన్ని వ్యతిరేకించే ప్రతి పౌరుడూ ఈ విధానంగా తమ వ్యతిరేకతను తెలియజేయవచ్చు. ప్రతిజ్ఞలో పాల్గొన్న వెంటనే పేరుతో కూడిన ఒక సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. అయితే పోయిన సంవత్సరం వెబ్‌సైట్ ద్వారా కేవలం రెండు కోట్ల పౌరులు, మూడు లక్షల సంస్థలు మాత్రమే ఇందులో తమ ప్రతిజ్ఞను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కనీసం 40 కోట్ల పౌరులైన దీనికి స్పందించాలి. ఈ దెబ్బతో అవినీతి అంతం కాకున్నా ప్రజలు దీనిని గమనిస్తున్నారు అనే విషయాన్నైనా ప్రభుత్వానికి, కేంద్ర నిఘా సంస్థకు తెలియజేయాలి. చేపట్టిన అవగాహనా వారం విజయవంతమైందన్న సంతృప్తి అయినా నిర్వాహకులకు మిగలాలి.ఒఎన్‌జిసి, కోల్ ఇండియా, స్టేట్ బ్యాంక్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలతో పాటు కేంద్రీయ విద్యాలయాలు ఈ వారాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. సివిసి పంపిణీ చేసిన అంశాల ప్రకారం ఉద్యోగులతో తప్పనిసరిగా అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞను చేయిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ప్రజల అవగాహన కోసం హోర్డింగ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగులతో ర్యాలీలు తీస్తున్నారు. యువతతో మారథాన్ పరుగులు పెట్టిస్తున్నారు. స్కూలు పిల్లలకు దేశంలో అవినీతి నిర్మూలన అంశంగా ఉపన్యాస, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు. కేంద్రీయ పాఠశాలల్లోనూ దీని నిర్వహణ బాగుంది. ప్లకార్డ్ పట్టుకొని, నినాదాలు ఇస్తూ వీధుల్లో స్కూలు పిల్లల ఊరేగింపు కొత్త ఆశల్ని రేకెత్తిస్తుంది.

చదువుకొనే రోజుల్లోనే సమాజంలో ఉన్న అవినీతి మురికి గురించి విద్యార్థులకు తెలియడం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఈ అంశంపై రాసే, మాట్లాడే అవకాశం రావడంతో వారు సమాచార సేకరణలో ఎన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. రకరకాల కార్యక్రమాల ద్వారా రేపటి పౌరులను ఈ విషయంలో ఆలోచించే దిశగా తీసుకెళ్లడం అవసరం. అవినీతికి దూరంగా ఉన్న అధికారులతో, సంఘ సేవకులతో విద్యార్థులకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. చర్చలు, క్విజ్‌లు నిర్వహిస్తే విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటారు. గత ఏడాది 75 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా సివిసి జాతీయ స్థాయిలో అవినీతి నిర్మూలన అంశంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజేతలైన విద్యార్థులకు ప్రధాని మోడీ బహుమతులను అందజేశారు.
అయితే ఇందులో కేవలం కేంద్రం నిర్వహణలో ఉన్న పాఠశాలలే పాల్గొంటే ఫలితం తక్కువగా ఉంటుంది. రాష్ట్రాల పాలనలోఉన్న పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా స్వచ్ఛందంగా ఈ క్రతువులో పాల్గొంటే మంచిది.

ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఈ అవగాహన వారాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలతో ప్రతిజ్ఞలు ఏర్పాటు చేసి దేశంలో ఉన్న అవినీతిపై ప్రసంగించవచ్చు. బాల మనస్సుల్లో మంచి బీజాలు నాటడం అధ్యాపకులకున్న సువర్ణావకాశమిది. పిల్లలతో ఊరేగింపులు, పోటీలు నిర్వహిస్తే మరింత గాఢంగా వారికి విషయం హత్తుకొనే అవకాశం ఉంటుంది. విజిలెన్స్ అవేర్‌నెస్ వారం సందర్భంగా వివిధ కార్యాలయాలు నిర్వహించిన కార్యక్రమాల సమాచారం సివిసికి అందజేస్తే దానిని వారు తమ వెబ్‌సైట్‌లో వుంచుతున్నారు. ఆ రకంగా ఆయా కార్యక్రమాలకు ప్రచారం వస్తుంది. సివిసి పరిధి కేంద్ర ప్రభుత్వ సంస్థలకే పరిమితమైనందు వల్ల దీని ఆదేశాలను రాష్ట్ర సంస్థలు, ఉద్యోగులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే సమస్య దేశ పౌరులందరిదీ. దీనికి కేంద్ర, రాష్ట్ర హద్దులేమి లేవు. కాబట్టి సివిసి ప్రకారం కానీ, రాష్ట్ర అనుకూలతను బట్టి కానీ ప్రభుత్వ నిధులను, ప్రజల సొమ్మును అక్రమ మార్గంలో సమకూర్చుకోనని ప్రభుత్వ అధికారులతో, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయిస్తే తప్పేమీ లేదు.

మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభ్ బాయి పటేల్ గౌరవార్థంగా ఆయన జన్మదినమైన 30 అక్టోబర్ నాడు ఈ ప్రత్యేక వారం మొదలవుతుంది. 2000 నుండి ఇది నిర్వహించబడుతోంది. ఇన్నేళ్ల కాలంలో ఎంత అవినీతి కట్టడి అయిందో ఎవరు చెప్పినా నమ్మలేము కానీ సివిసి ప్రయత్నాన్ని స్వాగతించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కుబడిగా సాగుతున్న ఈ వారాన్ని విజయవంతం చేసే బాధ్యత దేశ పౌరులు నెత్తికెత్తుకోవాలి. పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి ప్రతిజ్ఞకు విలువ వున్నందు వల్ల విరివిగా ఇందులో పాల్గొనాలి. సివిసి పేర్కొన్న ప్రతిజ్ఞా పాఠాన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి. నిజాయితీ గల పౌర ధర్మమే దేశాన్ని ప్రక్షాళన చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News