తిరువనంతపురం: వర్తమాన భారతదేశంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలుగా ప్రజాస్వామ్యం మారిపోయిందని, ప్రజాస్వామ్యానికి మూలాధారమైన సంభాషణల పట్ల కేంద్ర ప్రభుత్వానికి విశ్వాసమే లేదని ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి అర్థం చర్చించి నిర్ణయం తీసుకునే ప్రభుత్వమని ఆయన అన్నారు. అయితే ఈ ప్రభుత్వం మాట్లాడదని, ఎవరితోనూ ఏ విషయంపైన చర్చించదని, ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే తమకు అలా చేసే హక్కును ప్రజలు ఇచ్చారని వాదిస్తుందని ప్రభాకర్ అన్నారు.
కేరళ లపెజిస్టేచర్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్‌లో తాను రచించిన ది క్రూక్డ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్ పుస్తాకాన్ని గురించి శుక్రవారం ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఈ పుస్తకం మలయాళ అనువాదాన్ని కేరళ ఆర్థికమంత్రి కెఎన్ బాలగోపాల్ ఆవిష్కరించారు. భారతదేశ సామాజిక స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని, ఈ పరిస్థితిని కూకటివేళ్లతో పెకిలించివేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైందని, 1990 దశకం తర్వాత మొట్టమొదటిసారి దేశంలో పేదరికంలోకి దిగజారిపోయిన వారి సంఖ్య పెరిగిపోయిందని ఆయన గణాంకాలతోసహా వివరించారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని, గత పదేళ్లలో దేశంలో కుబేరుల సంఖ్య 125 నుంచి 145కి పెరిగిందని ఆయన తెలిపారు. పేదరికంలో జీవిస్తున్న వారు కటిక పేదలుగా మారిపోగా మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి జారిపోయారని ఆయన చెప్పారు.
దేశంలో నిరుద్యోగత, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని ఆయన చెప్పారు. 2014-15లో 30 శాతం ఉన్న ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పుడు 19 శాతానికి తగ్గిపోయాయని, దేశంలో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నపుడే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడతారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను చిత్తశుద్ధితో, నిజాయితీతో అమలు చేయడం లేదని, ఫలితంగా అభివృద్ధి కుంటుపడిందని ఆయన చెప్పారు.
ముస్లిముల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన నిశితంగా విమర్శించారు. బిజెపికి కేంద్ర క్యాబినెట్‌లో, పర్లమెంట్‌లో, యుపి, గుజరాత్ వంటి రాష్ట్ర శాసనసభలలో ఒక్క ముస్లిం ప్రతినిధి కూడా లేరని ఆయన గుర్తు చేశారు.
తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.