భోపాల్ : దేశంలో పేదరికం ఒక్కటే కులమని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పుడు తాను ఓబీసీని అని ఎందుకు చెప్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ లోని జగదల్‌పుర్‌లో ఎన్నికల ప్రకారంలో ప్రసంగించిన ఆయన… బీజేపీ వనవాసీ అనే పదం వాడి గిరిజనులను అవమానిస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆదివాసీకి బదులు వనవాసీ అనే పదం వాడుతున్నాయని, వనవాసీ, ఆదివాసీ మధ్య చాలా తేడా ఉందని రాహుల్ పేర్కొన్నారు.
ఆదివాసీ అనేది ఒక విప్లవాత్మక పదమని, ఆదివాసీ ఈ దేశానికి అసలైన యజమాని అని, కానీ బీజేపీ ఆ పదాన్ని వాడడం లేదని, ఆ పదాన్ని వాడితే మీనేల, నీరు, అడవిని మీకు ఇచ్చేయవలసి వస్తుందని గిరిజనులను ఉద్దేశించి రాహుల్ ప్రస్తావించారు. గిరిజనులను అవమానించేలా ఉన్న వనవాసీ పదాన్ని కాంగ్రెస్ అంగీకరించదని రాహుల్ స్పష్టం చేశారు.మద్య ప్రదేశ్‌లో బీజేపీ నేతలు గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసి , ఘటనను చిత్రీకరించారు. తర్వాత ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ పార్టీ ఆలోచనా ధోరణి అలా ఉంటుందని రాహుల్ బీజేపీని దుయ్యబట్టారు.