Saturday, December 21, 2024

ఏడేళ్ల బాలుని ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న సూది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏడేళ్ల బాలుని ఎడమ ఊపిరితిత్తిలో ఇరుక్కున్న సూదిని ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా మేగ్నెట్ ఉపయోగించి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా బయటకు తీయగలిగారు. ఈ అపూర్వ వైద్యప్రక్రియ గురించి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బాలుడు దగ్గుతుంటే రక్తం కారడంతో ప్రాణాపాయ స్థితిలో బుధవారం ఎయిమ్స్‌లో చేరాడు. రేడియోలజీ పరీక్షలో కుట్టుమిషన్‌లో ఉపయోగించే పొడవాటి సూది ఆ బాలుని ఎడమ ఊపిరితిత్తిలో లోతుగా చొచ్చుకుని పోయినట్టు తేలిందని పాడియాట్రిక్ సర్జరీ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ విశేష్ జైన్ తెలియజేశారు. ఈ వైద్య ప్రక్రియకు అవసరమైన అయస్కాంతాన్ని చాందినీ చౌక్ మార్కెట్ నుంచి బుధవారం సాయంత్రం కొని తీసుకు వచ్చారు. 4 ఎం.ఎం వెడల్పు, 1.5 మిమీ మందం ఉన్న ఈ అయస్కాంతం (మేగ్నెట్) ఈ వైద్య ప్రక్రియకు సరైనదేనని నిర్ధారించుకున్నారు.

అయితే ఈ వైద్య ప్రక్రియలో ఎదురయ్యే సంక్లిష్టతలపై మరో అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ దేవేంద్రకుమార్ యాదవ్ వివరిస్తూ సూది చాలా లోతులో ఇరుక్కుని ఉండడంతో సంప్రదాయ వైద్య విధానాలేవీ పనిచేయలేదని పేర్కొన్నారు. దీనిపై వైద్యబృందం విస్తృతంగా చర్చించి వినూత్న పరిష్కారాలను కనుగొన్నారు. శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తి లోకి సురక్షితంగా అయస్కాంతాన్ని దించి సూదిని బయటకు తీయడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు స్వయంగా ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారు. దానికి దారం, రబ్బర్ బాండ్ ఉపయోగించి అయస్కాంతాన్ని అమర్చారు. మొదట ఎండోస్కోపీ తాలూకు విండ్‌పైప్‌ను ఉపయోగించి ఊపిరితిత్తిలో సూది దాగి ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నారు. సూదికొన అయస్కాంతానికి తగిలేలా చేశారు. అయస్కాంత శక్తికి సూది అంటుకోగలిగింది. దాగి ఉన్న చోటు నుంచి బయటకు విజయవంతంగా సూదిని తీయగలిగినట్టు డాక్టర్ జైన్ తెలిపారు. ఇదేకాని పనిచేయకుంటే ఛాతీని, ఊపిరి తిత్తులను తెరవాల్సి వచ్చేదని జైన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News