Saturday, November 23, 2024

ప్రాణాలు కబళిస్తున్న ప్రమాదాలు

- Advertisement -
- Advertisement -

ఇటీవలే రెండు రోజుల క్రితం జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు 2022 సం.గాను రోడ్డు ప్రమాదాలపై నివేదికను విడుదల చేశారు. మన దేశం జాతీయ, రాష్ట్ర, ఇతర రహదారులుతో అన్నీ కలిపి 63.31 లక్షల కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద రోడ్డు వ్యవస్థ కలిగి ఉన్నది. ఇందులో జాతీయ రహదారులు 1.32 లక్షల కి.మీ (2.1%), రాష్ట్ర రహదారులు 1.80 లక్షల కి.మీ (2.8%), ఇతర రహదారులు 60.59 లక్షల కి.మీ (95.1%) పొడవు కలిగి ఉన్నాయి. మొత్తం రవాణా వ్యవస్థలో సరుకు రవాణాలో 71%, ప్రయాణీకుల రవాణాలో 85% రోడ్డు మార్గం ద్వారానే జరుగుతున్నాయి. నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలలో (జాతీయ రహదారులలో 1,51,997, రాష్ట్ర రహదారులలో 1,06,682, ఇతర రహదారులలో 2,05,633) 1,68, 491 మంది ప్రాణాలు కోల్పోగా (జాతీయ రహదారులపై 61,038, రాష్ట్ర రహదారులలో 41,012, ఇతర రహదారులలో 66,441) 4,43,366 మంది గాయాలపాలయ్యారు.

(జాతీయ రహదారులపై 1,44,352, రాష్ట్ర రహదారులలో 1,06,485, ఇతర రహదారులలో 1,92,529). అదే 2021 సంవత్సరంలో మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలలో 1,53,972 మంది మృత్యువాతపడగా 3,84,448 మంది క్షతగాత్రులయ్యారు. 2021 కంటే 2022లో పెరిగిన శాతం వరసగా 11.9 శాతం, 9.4 శాతం, 15.3 శాతంగా ఉంది. సగటున ప్రతీ గంటకు 53 ప్రమాదాలలో 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం ప్రమాదాలలో 33.80 శాతం మంది అక్కడికక్కడే ప్రాణాలు వదులుతున్నారు. ఇందులో గుర్తు తెలియని వాహనాల వలనే అత్యధికంగా 30,486(18.10%) మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక లక్ష జనాభాకు జరుగుతున్న ప్రమాదాల సంఖ్య 2021 సం.లో 30.3 ఉండగా, 2022 సం. వచ్చేసరికి ఇది 33.5 కి పెరిగింది. 100 ప్రమాదాలలో ఎంత మంది చనిపోయారో తెలియజేసే సంఖ్యని రోడ్డు ప్రమాద తీవ్రత అంటారు. ఇది 2021 సం.లో 37.3గా ఉంటే, 2022 సం. వచ్చేసరికి 36.5కి తగ్గింది. ఈ సంఖ్య అత్యధికంగా మిజోరాం (85), బీహార్ (82.4), పంజాబ్ (77.50)గా ఉంది. మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఈ తీవ్రత జాతీయ సగటు 36.5 కంటే తక్కువగానే ఉంది.

దేశసగటు కంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నా యి. దేశం మొత్తం మీద ఉన్న పది వేల వాహనాలకు 1970 సం. లో 103.5 మంది, 1980సం.లో 53.10 మంది, 1990సం.లో 28.20 మంది, 2000 సం.లో 16.2 మంది, 2010 సం.లో 10.50 మంది చనిపోగా, 2020 సం॥ వచ్చేసరికి 4.2 మంది మాత్రమే చనిపోయారు. చూడడానికి ఇవి తగ్గుతున్నట్టు అనిపిస్తున్నా రానురాను వాహనాలసంఖ్య పెరిగిపోతుండటంతో ప్రమాదాలు, మరణాలు ఎక్కువైపోతున్నాయి. 31 మార్చి 2020 నాటికి రిజిష్టర్ అయిన 32.6 కోట్ల వాహనాలలో ద్విచక్ర వాహనాలు 74.7%, కార్లు, జీపులు, టాక్సీలు 13.4%, ఇతర వాహనాలు 6.9%, సరుకు రవాణా వాహనాలు 4.4%, బస్సులు 0.7% వాటాలుకలిగి ఉన్నాయి. మొత్తం రహదారుల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల వాటా కేవలం 5 శాతమే అయినప్పటికీ మొత్తం ప్రమాదాలలో 56.1 శాతం ఈ రెండు రహదారుల్లో జరగడం గమనార్హం.

దేశంలో 2022లో జరిగిన ప్రమాదాలలో తమిళనాడు 18,972 (12.5%) మొదటి స్థానంలో ఉండగా, కేరళ 17,627 (11.6 %), ఉత్తరప్రదేశ్ 14990 (9.9%), మధ్యప్రదేశ్ 13860 (9.1%), కర్నాటక 13384(8.8%) తరువాత నాలుగు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 8650(5.7%), తెలంగాణా 7505(4.9%)తో వరుసగా 7, 8 స్థానాలలో ఉన్నాయి. ప్రమాదాలకు కారణాలలో మొదటిది అతి వేగం. దీని వలన 2022 సం.లో 72.3% ప్రమాదాలు జరిగాయి. 71.2 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. 72.8% మంది గాయాల పాలయ్యారు. తరువాత కారణాలలో మద్యం లేదా డ్రగ్స్ సేవించి డ్రైవింగ్ చేయడం, ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళడం , ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, మొబైల్ ఫోన్ల్లతో డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం, కారులలో సీటు బెల్టు పెట్టుకోకపోవడం, లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడం వంటి కారణాలుతో పాటుగా గతుకులతో కూడిన రహదారులు కూడా మరో ప్రధానమైన కారణం.

ఇంకా పాదాచారుల నిర్లక్ష్యం, వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, రోడ్డు నిర్మాణంలో లోపాలు, నిద్ర లేకుండా సుదీర్ఘంగా వాహనాలు నడపడం, కాలం చెల్లిన భద్రతా ప్రమాణాలు లేని వాహనాలలో ప్రయాణం చేయడం, అర్ధరాత్రి తరువాత కూడా వాహనాలు నడపడం, ట్రాఫిక్ చిహ్నాలపై అవగాహన లేకపోవడం, వయసు మళ్ళిన వారు డ్రైవింగ్ చేయడం, నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలపడంతో పాటుగా స్పీడ్ బ్రేకర్స్ మీద తెలుపు చారలు గుర్తించకపోవడం, మలుపుల దగ్గర సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వంటివి ఇతర కారణాలు. ప్రమాదాలలో కుటుంబ యజమాని మృత్యువాతపడితే ఆ కుటుంబాలు వీధినపడతారు. నైపుణ్యం గల వారు చనిపోతే వారి సేవలు లభించక దేశ జిడిపిపై ప్రభావం పడుతుంది. సరుకులతో వెళ్త్తున్న వాహనాలు ప్రమాదానికి గురైతే యాజమానులు ఆర్థికంగా నష్టపోతారు. వాహనాలు పనికి రాకుండా పోతాయి.బీమా సంస్థలకు కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అతివేగంగా వాహనాలు నడుపరాదు. బ్లూ టూత్స్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయరాదు. రాత్రి పూట రోడ్డుపై వాహనాలు నిలుపరాదు.

తెల్లవారు జామున వాహనాలు డ్రైవింగ్ చేయకూడదు. జన సమూహం ఎక్కువగా ఉన్న చోట, పాఠశాలల వద్ద నిదానంగా వెళ్ళాలి.ఒకే విడతలో ఎక్కువ గంటలు ట్రక్కులు నడుపరాదు.రాత్రిళ్ళు చీకటిలో సైకిళ్లపై ప్రయాణం చేయకూడదు. ద్వి చక్ర వాహనదారులు హెల్మెట్లు, కార్లలో ప్రయాణం చేయువారు సీటు బెల్టులు ధరించాలి. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదు. అతి వేగానికి అడ్డుకట్ట వేయడానికి రహదారుల వెంబడి ఎక్కువ సంఖ్యలో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలి.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలి. స్పీడ్ బ్రేకర్స్ మీద తెలుపు రంగు, రేడియం ఎరుపు రంగు చారలు ఉండేటట్లు చూడాలి. మలుపుల దగ్గర, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న దగ్గర సైన్ బోర్డులు పెట్టాలి. అవసరం లేని వారికి స్పోర్ట్ బైక్స్ నిషేధించాలి. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై జరిమానాతో పాటుగా 5 సంవత్సరాల వరకు కొత్తగా లైసెన్సులు జారీ చేయకూడదు. మైనర్లు పట్టుబడితే వారిపైనే కాకుండా ఆ బండి యాజమానుల పైనా జరిమానాతో పాటుగా వారి లైసెన్సులు కూడా రద్దు చేయాలి. కళాశాలలను సందర్శించి స్పోర్ట్ బైక్స్ కనిపిస్తే కళాశాల యాజమాన్యాల వారిపైనా కూడా చర్యలు తీసుకోవాలి. లైసెన్స్ విధానం కఠినతరం చేయాలి. ఇవి కేవలం అధికారులు, ప్రభుత్వాలు చేయలేవు. ప్రజలు కూడా సహకరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News