Friday, December 20, 2024

మరికాసేపట్లో భారత్-దక్షిణాఫ్రికా ఢీ

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ వన్డే టోర్నీలో భాగంగా మరికాసేపట్లో దిగ్గజాలు ఢీకొనబోతున్నాయి. ఇప్పటివరకూ ఎదురు లేకుండా వరుసగా అన్ని మ్యాచ్ లలోనూ నెగ్గుతూ వస్తున్న భారత జట్టు.. పటిష్ఠమైన దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతున్న ఈ మ్యాచ్ లో అందరికళ్లూ భారత్ పైనే ఉన్నాయి.

ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఏడు మ్యాచ్ లు ఆడి, ఆరింటిలో గెలిచింది. మొదట్లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడటంతో అందరూ తక్కువ అంచనా వేసినా, ఆ తర్వాత దక్షిణాఫ్రికా కోలుకున్న తీరు అమోఘం. ప్రత్యర్థి జట్లపై భారీ స్కోర్లు నమోదు చేస్తూ వస్తోంది. ఆస్ట్రేలియాను 134 పరుగుల తేడాతో మట్టి కరోపించింది. న్యూజీలాండ్ ను 190 పరుగుల తేడాతో ఓడించింది. ప్రతి మ్యాచ్ లోనూ దక్షిణాఫ్రికా జట్టులో సెంచరీలు నమోదు అవుతూండటం మరో విశేషం. ముఖ్యంగా డికాక్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రపంచ కప్ లో ఇప్పటివరకూ నాలుగు సెంచరీలు చేసి జోరు మీదున్నాడు. క్లాసెన్, డసెన్, మార్ క్రమ్, మిల్లర్ కూడా సెంచరీలు చేయడం విశేషం.

ఇక ఇండియా విషయానికొస్తే, ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ తోపాటు వన్డౌన్ లో వచ్చే కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండటం కలిసొచ్చే అంశం. రోహిత్ శర్మ చెలరేగితే, అడ్డుకోవడం ఎంతటి ప్రత్యర్థికైనా కష్టమే. ఇప్పటివరకూ శ్రేయస్, సూర్యకుమార్ ల ఫామ్ పై అనుమానం ఉన్నా, మొన్న ఇంగ్లండ్ పై జరిగిన మ్యాచ్ లో ఇద్దరూ అదరగొట్టారు. బౌలింగ్ విషయానికొస్తే, ఇండియాకు పేసర్లు కొండంత అండగా నిలుస్తున్నారు. షమీ, సిరాజ్ వికెట్లు తీస్తుంటే, బుమ్రా అద్భుతంగా బాల్స్ వేస్తూ పరుగులు కట్టడి చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో కొయెట్జీ, జాన్సన్ లు కత్తుల్లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. భారతీయ పిచ్ లపై స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సత్తా చూపిస్తున్నాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్, రవీంద్ర జడేజా, కుల్ దీప్, బుమ్రా, షమి, సిరాజ్.

దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్), డికాక్, డసెన్, మార్ క్రమ్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్, కేశవ్ మహరాజ్, కొయెట్జీ, రబడా, ఎంగిడి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News