జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్ పోర్టులో ఓ అగంతకుడు కలకలం సృష్టించాడు. దాంతో ఎయిర్ పోర్టును మూసేశారు. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కారులో దూసుకువచ్చి, బ్యారికేడ్లను ఢీకొంటూ నేరుగా రన్ వే పైకి కారును తీసుకెళ్లాడు. తన కారును ఓ విమానానికి అడ్డంగా పార్క్ చేశాడు. కారులోంచి బయటకొచ్చి, తుపాకితో రెండు రౌండ్లు కాల్పులు జరపడంతోపాటు పెట్రోల్ సీసాలకు నిప్పంటించి బయటకు విసరడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
తాత్కాలికంగా ఎయిర్ పోర్టును మూసివేసి, అగంతకుడితో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అతనితోపాటు కారులో అతని నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. తన భార్యకు తెలియకుండా అతను కుమార్తెను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. అతని భార్య ఇప్పటికే తన కూతురు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుడి మానసిక పరిస్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ పోర్టును మూసేయడంతో 27 విమానాల రాకపోకలు స్తంభించిపోయాయి.